
మా పొట్ట కొట్టొద్దు సారూ..!
పెడన: ఎన్డీయే కూటమి ప్రభుత్వం కుడి చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి... కుర్ర చేత్తో లాగేసుకుంటోందని దివ్యాంగులు వాపోతున్నారు. పింఛన్లు నిలుపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న దివ్యాంగులు బుధవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పొట్టలు కొట్టవద్దంటూ అధికారులను ప్రాథేయపడుతున్నారు. పెడన పట్టణంలో మంచానికే పరిమితమై బెడ్‌రిడింగ్ ఉన్న వారు 24 మంది ఉంటే వీరిలో 21 మంది ఫేక్ అని, మరో ముగ్గురు మాత్రమే రూ.15వేలు పింఛనుకు అర్హులని పేర్కొంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. సదరం సర్టిఫికెట్ ద్వారా 90 శాతం నుంచి 80 శాతానికి వికలాంగత్వాన్ని తగ్గించి రూ.15వేలు పింఛను కాస్తా రూ.6 వేలుకు మార్పు చేసింది. దీంతో వారంతా బుధవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు మొరపెట్టుకుని అప్పీల్ చేసుకున్నారు. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన పోలిశెట్టి తిరుమలరావు చేనేత కార్మికుడు.
రూ.6 వేలు కూడా రద్దు చేశారు...
కుడి కన్ను పోయింది. ఎడమ కన్నుతో కూడా చూపు అంతంత మాత్రమే. రూ.6వేలు పింఛను పొందుతున్న ఇతనికి సదరం సర్టిఫికెట్‌లో వికలాంగశాతం 40 కంటే తక్కువ ఉందని చూపించి ఏకంగా పింఛను రద్దు చేసేశారు. మున్సిపాలిటీ పరిధిలో 548 వికలాంగుల పింఛన్లు ఉండగా వీటిల్లో పది మందిపై అనుమానంతో రిజెక్ట్ చేశారు. వీరిలో ఐదుగురికి వికలాంగుల పింఛను నుంచి వృద్ధాప్య పింఛనుగా మార్పు చేశారు. మరో ఐదు పింఛన్లు రద్దు చేశారు. పింఛను మార్పు, రద్దు చేసిన వారికి అనుమానాలుంటే నోటీసులు అందిన 30 రోజుల్లోగా తిరిగి అప్పీల్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి చెప్పారు.
– మండలంలో వికలాంగుల పింఛన్లు రూ.6వేలుకు సంబంధించిన వారు 854 మంది ఉండగా వీరిలో 45 మందికి వికలాంగత్వ శాతం తక్కువగా ఉందని పేర్కొంటూ నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు 21 మందికి నోటీసులు జారీ అవగా, మరో 24 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. రూ.15వేలు పింఛను పొందుతున్న వారు 17 మంది ఉండగా వీరిలో ముగ్గురి పింఛన్లు రద్దు చేశారు. వీరికి నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీవో కేవీఎస్‌వీ శివప్రసాద్ తెలిపారు.
కూటమి ప్రభుత్వాన్ని
ప్రాధేయపడుతున్న దివ్యాంగులు
పెడన పట్టణంలో రూ.15 వేలు పింఛను పొందేవారు 24 మంది
వారిలో 21 మంది ఫేక్ అంటూ నోటీసులిస్తున్న అధికారులు
అప్పీల్ చేసేందుకు మున్సిపల్
కార్యాలయానికి వచ్చిన బాధితులు