
వేర్వేరు కేసుల్లో బంగారం దొంగలు అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): అత్యాశకు పోయి యజమాని ఇంటిలో బంగారు దొంగిలించిన వేర్వేరు కేసుల్లో నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విజయవాడ కమిషనరేట్ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గురునానక్‌నగర్‌లోని కనకదుర్గ గెజిటేట్ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే దేవరకొండ తేజశ్రీ(24) శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలోని 5వ క్రాస్‌రోడ్డులో ఉండే అసుసుమిల్లి శివలీల ఇంటిలో పనిమనిషిగా చేరింది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న రూ.13లక్షల విలువ చేసే 40 గ్రాముల డైమండ్ గాజులు, 114 ఆభరణాలను దొంగింలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితురాలిపై పటమట పోలీసులు నిఘా పెట్టగా ఆమె వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.
● అశోక్ నగర్, వెంకటప్పయ్య వీధిలో నివాసం ఉండే బైసాని జనార్ధన్ కుటుంబసభ్యులు కుమారుడి వివాహం అనంతరం జూలై 31వ తేదీన శ్రీశైలం వెళ్లగా, ఆగస్టు 1వ తేదీన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయని పనిమనిషి సమాచారంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా బెంజ్ సర్కిల్, నర్మదా లాడ్జ్ దగ్గరలో, ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్:3, ఎన్‌హెచ్ –16 సర్వీస్ రోడ్డు మార్జిన్ లో నిందితుడిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు అడవి తక్కెళ్లపాడుకు చెందిన ఉప్పల సురేష్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కేజీల వెండి వస్తువులు చోరీ చేయగా అతని వద్ద గుంటూరు జిల్లా పట్టాభిపురంలో దొంగతనం చేసిన 60 గ్రాముల బంగారు ఆభరణాలు, పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన 300 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పాత నేరస్తుడని, అతనిపై ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయని, నిందితుడు జల్సాలకు అలవాటు పడి సుమారు 20 నేరాలకు పాల్పడ్డాడని చెప్పారు. సమావేశంలో మహిళా ఎస్‌ఐలు దుర్గా దేవి, రేవతి, ఏఎస్‌ఐ వి.గోపి, హెచ్.సి అబ్దుల్ రషీద్ కానిస్టేబుల్ నరేశ్, మహిళా కానిస్టేబుల్ సునీత పాల్గొన్నారు.