
మార్గదర్శులు స్వచ్ఛందంగా వచ్చేలా చర్యలు చేపట్టండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఉన్నత వర్గాల వారిని చైతన్యపరిచి పీ–4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జేసీ గీతాంజలిశర్మతో కలిసి పీ–4 కార్యక్రమం పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 53,759 మంది పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. వీరిలో 48,375 బంగారు కుటుంబాలను 4,272 మార్గదర్శిలకు అనుసంధానం చేశామన్నారు. ఉన్నత వర్గాల వారు, ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి సంప్రదించి వారికి పీ4 కార్యక్రమంపై సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావటమే ప్రధాన లక్ష్యమని, ఆర్థికంగా వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చటంలో సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలని మార్గదర్శిలకు సూచించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ మురళీకిషోర్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్‌బాబు, సీపీవో భీమరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ