
ఫుడ్‌సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్, లీగల్ మెట్రా లజీ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలో పలు హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలపై జాయింట్ ఫుడ్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ ఆధ్వర్యాన విస్తృతంగా తనిఖీలు జరిగాయి. సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని యూఎస్ బేక్ హౌస్‌లో ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. బేక్ హౌస్‌లో కాలంచెల్లిన ఆహార పదార్థాలను, ఫ్రిజ్‌లో నాన్‌వెజ్ తోపాటు పాడైన బేకరీ పదార్థాలను నిల్వచేయడాన్ని, ఆహార పదార్థాల్లో రంగులను కలుపడాన్ని గుర్తించారు. కనీస పరిశుభ్రత లేకపోవటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేకరీకి లైసెన్సు కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. నగరంలో 20 బృందాలుగా ఏర్పడిన అధికారులు 39 హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలను తనిఖీ చేశామన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను ఉల్లంఘించిన, పరిశుభ్రత పాటించని 13 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారు. సుమారు 100 కిలోల నిల్వ ఉంచిన, పాడైన చికెన్‌ను పడేశారు. ల్యాబుల నుంచి ఫలితాలు వచ్చిన తదుపరి బాధ్యులపై ఫుడ్ సేఫ్టీ – స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం చర్యలు తీసుకుంటామని పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈ తనిఖీలలో వివిధ జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, సహాయ ఆహార నియంత్రణాధికారులు, లీగల్ మెట్రోలాజీ అధికారులు పాల్గొన్నారు.