
మహిళా సాధికారతే లక్ష్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సాధికారతే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో ‘మహిళల సంక్షేమం, భద్రత, రక్షణ, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం’ మంగళవారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత సంస్థ, కేబీఎన్ కళాశాల ఉమెన్స్ స్టడీ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయపాటి శైలజ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సైబర్ నేరాల ముప్పు పొంచి ఉందన్నారు. మహిళలు డిజిటల్ భద్రతపై చైతన్యం పెంచుకోవాలని, అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్‌లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు రాధాకుమారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి షెక్ రుఖ్సానా సుల్తాన్ బేగం, మహిళా కమిషన్ కార్యదర్శి అనురాధ, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, కార్యదర్శి టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.