అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్
డీకే బాలాజీ ఆదేశం
ఎదురుమొండి(నాగాయలంక): వరద పరిస్థితులను పరిశీలించేందుకు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సాయంత్రం నాగాయలంక మండలంలో పర్యటించారు. ఆయన తొలుత స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ఆంజనేయప్రసాద్, జలవనరుల శాఖ ఇంజినీర్లు, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తదుపరి మండలంలోని ఎదురుమొండి దీవికి వెళ్లి గొల్లమంద మార్గంలో నది కోతకు గురైన 700మీటర్ల రహదారిని పరిశీలించి, తాత్కాలిక మరమ్మతులపై పంచా యతీరాజ్ అధికారులకు సూచనలు చేశారు.
సంసిద్ధంగా ఉన్నాం..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 4.3లక్షల క్యూసెక్కుల వరద నీటిని నదికి వదిలారని, కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి గమనించడానికి, అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ శాఖలతో సమన్వయ సమావేశాలు జరిపి వరద ప్రవాహం పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆదేశించామన్నారు. కలెక్టర్ పర్యటనలో తహసీల్దార్ సీహెచ్‌వీ ఆంజనేయప్రసాద్, ఎంఈపడీవో పి.సుధాప్రవీణ్, ఇరిగేషన్ డీఈఈ గణపతి, ఏఈఈ పి.రవితేజ, పీఆర్ ఏఈఈ సురేష్‌బాబు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.


