
కృష్ణాజిల్లా : జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, శ్రద్ధాంజలి ఘటించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. టీడీపీ ఎమ్మెల్యే చిత్ర పటాన్ని తగలబెట్టి నిరసన తెలియజేశారు.
దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకూ రోజుకో రీతిలో నిరసన తెలుపుతామంటూ హెచ్చరించారు. ఆపై జూనియర్ .ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి , గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టారు అభిమానులు.
కాగా, రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు.