
ఆక్వా ల్యాబ్ సేవలు అభినందనీయం
కృష్ణా జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు నాగరాజా
గుడివాడరూరల్: గుడివాడ మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కృష్ణా జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎ.నాగరాజా పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌యార్డ్‌లో ఉన్న మత్స్యశాఖ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సభ్యులతో కలసి సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత ఆక్వా ల్యాబ్‌లో ఏ రకమైన పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, తదితర విషయాలను బృందం సభ్యులకు మత్స్యశాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నాగరాజా మాట్లాడుతూ గుడివాడ డివిజన్ పరిధిలో 42వేల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతుందని, ఈ ల్యాబ్‌ను ఆయా ప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగించుకుంటున్నారన్నారు. అదేవిధంగా ఈ ల్యాబ్‌లో నీరు, మట్టి నాణ్యత పరీక్షలు, మేత నాణ్యత పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో గుడివాడ మత్స్యశాఖ సహాయ సంచాలకులు సీహెచ్ ప్రసాద్, గుడివాడ, నందివాడ మత్స్యశాఖ అధికారులు మంజూష, రవికుమార్, వీఎఫ్‌ఏలు, ఎంపీఈడీఏలు, సిబ్బంది పాల్గొన్నారు.