అక్రమ బిల్లుల నైవైద్యం | - | Sakshi
Sakshi News home page

అక్రమ బిల్లుల నైవైద్యం

Aug 19 2025 6:45 AM | Updated on Aug 19 2025 6:45 AM

అక్రమ బిల్లుల నైవైద్యం

అక్రమ బిల్లుల నైవైద్యం

విజయవాడలో యథేచ్ఛగామెడికల్‌ మాఫియా దందా విచ్చలవిడిగా కొనసాగుతున్న ‘ఎల్‌ఓసీ’ల జారీ ప్రక్రియ 20 నుంచి 30 శాతం కమీషన్లు దండుకుంటున్న వైనం

లబ్బీపేట(విజయవాడతూర్పు): బెజవాడలో మెడికల్‌ మాఫియా దందా సాగిస్తోంది. జబ్బు చేస్తే వైద్యానికి డబ్బులు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే సాయాన్ని సొమ్ము చేసుకుంటోంది. సచివాలయంలోని ముఖ్య మంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు వ్యక్తులు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌ఓసీ)ల దందా సాగిస్తున్నారు. వైద్యం పొందకుండానే ఆస్పత్రుల నుంచి బిల్లులు తెచ్చుకుంటే రీయింబర్స్‌ మెంట్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.

కమీషన్‌ కొట్టు.. ఎల్‌ఓసీ పట్టు

వైద్యానికి అయ్యే ఖర్చులకు ప్రభుత్వం నుంచి ఎల్‌ఓసీ తీసుకొచ్చేందుకు కొందరు వ్యక్తులు 20 నుంచి 30 శాతం వరకూ కమీషన్‌ దండుకుంటున్నారు. విజయవాడలోని రెండు మూడు ఆస్పత్రుల కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నారని, రోజుకు నాలుగైదు ఎల్‌ఓసీలు వాటికే ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎల్‌ఓసీలు ఎమ్మెల్యేల లేఖలు లేకుండానే తీసుకొస్తున్నట్లు తెలిసింది. కొందరైతే ఎమ్మెల్యే లేఖలు కూడా తామే తెస్తామని బేరం కుదుర్చుకుంటున్నారు. రోగి స్వచ్ఛందంగా వెళ్తే, ఆస్పత్రి నిర్వాహకులు ఇచ్చిన అంచనా వ్యయంలో 40 శాతానికే ఎల్‌ఓసీ ఇస్తున్నారని, ఈ ముఠా సభ్యులు 60 శాతం వరకూ తీసుకొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చికిత్స అనంతరం వీళ్లు తీసుకొచ్చిన ఎల్‌ఓసీలకు సంబంధించిన బిల్లులు సైతం వెంటనే ఇప్పించేందుకు ఆస్పత్రుల నుంచి సైతం కమీషన్లు తీసుకుంటున్నారు. నిజాయ తీగా వైద్యం చేసిన ఆస్పత్రులకు నాలుగు, ఐదు నెలలకు కూడా బిల్లులు రావడం లేదని, కానీ కమీషన్‌ ఇచ్చిన వారికి నెలా రెండు నెలల్లోనే వచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పరిశీలన ఏదీ..?

ఆరోగ్య శ్రీలో చికిత్స అందించాలంటే నిపుణుల కమిటీ పరిశీలన తప్పని సరి. ఎల్‌ఓసీల జారీలో నిపుణుల పరిశీలన లేకుండానే ఆస్పత్రులు ఇచ్చే అంచనా వ్యయాన్ని ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రోగికి ఎల్‌ఓసీ ఇస్తే చికిత్స అనంతరం ఆస్పత్రులు పెట్టే బిల్లులను కూడా సరిగ్గా పరిశీలించకుండానే మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని సీనియర్‌ వైద్యులు పేర్కొంటున్నారు. సరైన పరిశీలన లేకపోవడంతో ప్రభుత్వం ఉదారంగా ఇచ్చే సాయంలో సగం దళారుల జేబుల్లోకి వెళ్తోందని వివరిస్తున్నారు.

ప్రభుత్వానిదే బాధ్యత

పేద రోగుల వైద్యం కోసం ఇచ్చే ఎల్‌ఓసీలకు కమీషన్‌లు దండుకునే ముఠా సభ్యులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు సూచించారు. ఒకే ఆస్పత్రి నుంచి ఎక్కువగా ఎల్‌ఓసీలు ఇస్తున్నప్పుడు కనీసం స్పెషాలిటీ, సూపర్‌స్ఫెషాలిటీ నిపుణులతో వాటిని పరిశీలించాలని, వైద్యం కోసం ఉదారంగా ఇచ్చే సాయం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.

వైద్యం చేయకుండానే బిల్లులు

కొన్ని ఆస్పత్రులు అక్రమ సంపాదనే లక్ష్యంగా వైద్యం చేయకుండానే చేసినట్లు అడిగినంత మొత్తానికి బిల్లులు ఇచ్చేస్తున్నాయని, అందులో 30 నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బిల్లులను సీఎంఆర్‌ఎఫ్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంట్‌కు వాడుతున్నట్లు తెలిసింది. ఇన్సూరెన్స్‌ ఉన్న వారు ఆస్పత్రిలో చేరకుండానే చేరినట్లు చూపించి వైద్యానికి అనుమతి తీసుకుంటున్నారని, అలా రూపొందించిన దొంగ బిల్లులతో ఆ ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి వచ్చిన మొత్తంలో రోగి, ఆస్పత్రి నిర్వాహకులు పంచు కుంటున్నారని, ఈ తరహా దందాలు విజయవాడ సీతారామపురం సమీపంలోని ఓ ఆస్పత్రిలో ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని ఆస్పత్రులు ఇదే మార్గంలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement