గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరు బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు డిమాండ్ చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై హామీని అమలు చేయా లని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బచ్చలకూర పుష్పరాజు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబు వాగ్దానాలతో బీసీలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎరగొర్ల ఉదయ్‌కిరణ్ యాదవ్, దొండపాటి శామ్యూల్ కుమార్, కె.వి. కోటేశ్వరరావు, దాసరి కృష్ణ, మల్లాది అశోక్, కె.వి.రత్నం, గాలంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సామూహిక వరలక్ష్మి వ్రతాలకు దరఖాస్తుల స్వీకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 22వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించనున్నారు. అమ్మ వారి సన్నిధిలో జరిగే ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు దేవస్థానం ఉచితంగా దరఖాస్తులను పంపిణీ చేస్తోంది. మంగళవారం వరకు భక్తులకు దరఖాస్తులు అందజేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 20వ తేదీ సాయంత్రానికి దేవస్థానం టోల్‌ఫ్రీ కౌంటర్‌లో అందజేయాలని సూచించారు. తెల్లరేషన్ కార్డు కలిగిన భక్తులు తమ రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కౌంటర్‌లో చూపించి దరఖాస్తును పొందాలని పేర్కొన్నారు. 22వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక వరలక్ష్మీవ్రతం ప్రారంభమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. వ్రతం అనంతరం భక్తులకు దేవస్థానం ప్రసాదం కిట్‌లను అందజేస్తుంది. వ్రతంలో పాల్గొన్న మహిళలకు రూ.100 క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
మనిషి ఉన్నతికి మూలం విద్య
మైలవరం: మనిషి ఉన్నతికి మూలం విద్య అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు, గిరిజన శాఖ ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎ.మణికుమార్ పేర్కొన్నారు. వార్షిక తనికీల్లో భాగంగా సోమవారం మైలవరంలోని శ్రీలీలావతి గిరిజన పాఠశాలను ఆయన సోమ వారం సందర్శించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. చదువులో రాణించడానికి భాషాభేదాలు, వర్గవైషమ్యాలు అడ్డురావన్నారు. అట్టడుగు వారు కూడా చదువు ద్వారా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ఇంగ్లిష్, లెక్కలు, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఉడతా లక్ష్మీనారాయణ, కార్యదర్శి జంజనం రాధాకుమారి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రకాశం బ్యారేజీకి నిలకడగా వరద
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి వరద నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీకి 2,51,783 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీనిలో 2,48,450 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మరో 3,333 క్యూసెక్కులు కాలువలకు మళ్లిస్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో 2,90,122 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నిలకడగా సాగుతోంది. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 3.03 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మంగ ళవారం ఉదయానికి నీటి ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.