
అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ బాలాజీ ఆదేశాలు సమస్యల పరిష్కారం కోసం 139 అర్జీలు
కోడూరు మండలం దింటిమెరక గ్రామంలోని దివి ఈస్ట్ చానల్ కుడివైపు గట్టుపై గ్రామానికి చెందిన ఒకరు రేకులషెడ్డు నిర్మించి మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలకు, మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తున్నారని, ఆ షెడ్డును తొల గించి గ్రామంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన కొందరు అర్జీ ఇచ్చారు.
కోడూరు మండలం దింటిమెరక గ్రామం నుంచి పాలకాయతిప్ప వరకు గల ఈస్ట్ చానల్ 15, 16, 17, 18 నంబర్లు గల పంట కాలువలు, డైరెక్ట్ పైపుల కింద సుమారు నాలుగు వేల ఎకరాల మాగాణి పొలాలు వరినాట్లు వేయకుండా ఖాళీగా ఉన్నాయని, ఇరాలీ గ్రామం వద్ద ఉన్న రత్నకోడు మురుగుకాలువ నుంచి న్యూ ఇరాలీ డ్రెయిన్ వైపునకు నాలుగు చోట్ల అక్రమంగా తూములు ఏర్పాటు చేయడం ద్వారా ఆ నీరంతా వచ్చి పొలాల ముంపునకు గురవటంతో ఈ పరిస్థితిని నెలకొందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయ కుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు ఫిర్యాదు చేశారు. తూములు తొలగించి ఆ పొలాల్లో నాట్లు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం పీజీఆర్‌ఎస్ (మీ–కోసం) కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహెద్, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఎస్పీ చప్పిడి రాజా అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.
సాధారణ రైతులకే యూరియా
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యూరియాను కేవలం సాధారణ రైతులకు చేరాలని స్పష్టంచేశారు. ఫౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమలు తదితర వ్యవసాయేతర అవసరరాలకు వినియోగించకూడదని హెచ్చరించారు. దీని పర్యవేక్షణ కోసం వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా యూరియాను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల నాలుగు వారాల పాటు శిక్షణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. శిక్షణలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 75 మంది అధికారులు హాజరయ్యారని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతి పరిజ్ఞానాన్ని రోజువారీ వృత్తిలో వినియోగించటం ద్వారా పనిని సులభతరం చేసుకోవచ్చని, ఆ విధంగా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ బాలాజీ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ దశల్లో ఉత్తమ అధికారిగా ఎంపికై నందుకు జిల్లా యంత్రాంగం ఆయనను సత్కరించి అభినందించింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు 139 అర్జీలను అందజేశారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..