
నూతన బార్ పాలసీకి గెజిట్ నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీపట్నం): నూతన బార్ పాలసీ (2025–2028) కింద కృష్ణా జిల్లాలో 39 జనరల్ బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు తెలిపారు. ఆయన తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పది, గుడివాడలో మునిసిపాలిటీలో పది, ఉయ్యూరులో ఒకటి, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో 14, పెడన మునిసిపాలిటీలో ఒకటి, మంగినపూడిలో ఒకటి, అవనిగడ్డలో రెండు చొప్పున బార్‌లకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తూ గీతకులాల వారికి నాలుగు షాపులు కేటాయించామని, వీటికి ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ వస్తామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గీత కులాల్లో ఉపకులాలైన గౌడ కులానికి తాడిగడప, మచిలీపట్నం కార్పొరేషన్, గుడివాడ మునిసిపాలిటీల్లో ఒక్కొక్క షాపు కేటాయించేందుకు సోమవారం కలెక్టర్ డి.కె.బాలాజీ లాటరీ తీసి ఎంపిక చేశారు. గౌడ్ కులానికి తాడిగడప–1 షాపు లాటరీ పద్ధతిలో కేటాయించారు. ప్రస్తుతం జనరల్ బార్లకు ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా లైసెన్సు ఫీజు 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న వాటికి రూ.35 లక్షలు, 50 వేల నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతానికి రూ.55 లక్షలుగా నిర్ణయించామని వివరించారు. ప్రతి దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.5.10 లక్షలు చెల్లించాలని తెలిపారు. జనరల్ బార్లకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28వ తేదీన కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో లాటరీ ద్వారా షాపులు ఏటాయిస్తామని వివరించారు. గీత కులాలకు చెందిన నాలుగు షాపులకు లైసెన్సు ఫీజులో 50 శాతం రాయితీతో ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వారికి కూడా అప్లికేషన్ ఫీజు రూ.5.10 లక్షలు ప్రతి దరఖాస్తుదారుడు చెల్లించాలని స్పష్టంచేశారు. గీత కులాలకు వారికి ఈ నెల 30వ తేదీన లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తామన్నారు. నూతన బార్లలో ఉదయం పది నుంచి రాత్రి 12 గంటల వరకు విక్రయాలకు అనుమతులు ఇస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 63001 00899, 99636 04239 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.