
అట్రాసిటీ కేసుల్లో సత్వర చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణం పరిహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని చార్జ్‌షీట్‌లు దాఖలయ్యాయి, కేసులు ఫైల్ చేయడంలో జాప్యానికి గల కారణాలు, ఇప్పటి వరకు బాధితులకు నష్టపరిహారం ఎంత చెల్లించారు అన్న వివరాలను డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. అణగారిన వర్గాలపై ముఖ్యంగా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలపై వివక్ష, దౌర్జన్యాలను తొలగించడమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు తక్షణం న్యాయం చేసేలా పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. క్లిష్టమైన కేసులను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్‌బాబు, గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు.