
నిబద్ధత కలిగిన నాయకుడు గౌతు లచ్చన్న
చిలకలపూడి(మచిలీపట్నం): సర్దార్ గౌతు లచ్చన్న నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లచ్చన్న బడుగు, బలహీనవర్గాల వారికి ఎనలేని సేవలు చేశారన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ రెండింటికి ఒకేసారి పోటీ చేసి గెలుపొందిన గొప్ప నాయకుడన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ దిశగా రిజర్వేషన్ల కోసం పోరాడారన్నారు. ఆయన కృషితోనే నేడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, కార్పొరేటర్ జోగి చిరంజీవి, వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ అచ్చెబా, గాజుల భగవాన్, బడే భాను, మాడపాటి వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.