ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరచూ డాక్టర్ గైర్హాజరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం విధులు నిర్వర్తించకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ పైనే మక్కువ రాజకీయ అండతో పెచ్చుమీరిన నిర్లక్ష్య ధోరణి
మచిలీపట్నంఅర్బన్: నగర పరిధిలోని చిలకలపూడిలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సిన మహిళా వైద్యురాలు తరచుగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో పీహెచ్‌సీలో వైద్యసిబ్బందే డాక్టర్ స్థానంలో చికిత్స అందించే పరిస్థితి ఏర్పడింది. ఈ పీహెచ్‌సీకి నిత్యం 60 నుంచి 70 వరకు పేషెంట్లు వస్తుంటారు. వీరందరికీ సిబ్బందే దిక్కు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, అత్యవసర వైద్య సహాయం అవసరమయ్యే వారు సరైన పరీక్షలు, చికిత్సలు పొందలేక వైద్య సిబ్బంది ఇచ్చే మందులతోనే సరిపెట్టుకోవాల్సివస్తోంది. డాక్టర్ గైర్హాజరుపై స్థానికులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
కూటమి పెద్దల అండదండలు
వైద్యురాలి గైర్హాజరు వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆమె కుటుంబ రాజకీయ సంబంధాలే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాక, ఆసుపత్రి సిబ్బందిపై దురుసు ప్రవర్తన ప్రదర్శిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె అవమానకర వైఖరి కారణంగా పలువురు సిబ్బంది ఉద్యోగాలు వదిలిపెట్టిన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూజ్యం
ఓపీ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నా వైద్యురాలు గైర్హాజరుతో సిబ్బంది, అటెండెంట్లే క్లినిక్ నడపాల్సి వస్తోంది. ఆసుపత్రిపై అధికారుల పర్యవేక్షణ లేక వైద్యురాలు తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారికంగా ఎటువంటి సెలవులు మంజూరు చేయలేదని తెలుస్తోంది. అయితే రాజకీయ అండతో విధులకు గైర్హాజరు అవుతున్న డాక్టర్ ఉన్నతాధికారుల మందలింపుల తరువాత కూడా తమ ధోరణి మార్చుకోలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకుల అండతో ప్రభుత్వ వైద్యురాలి నిర్లక్ష్య వైఖరి ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగం...ప్రైవేట్ ప్రాక్టీస్
మహిళా వైద్యురాలు అధికారిక విధుల కన్నా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రికి రావ డంలో నిర్లక్ష్యం చూపుతున్న ఆమె నగరంలోని తన ప్రైవేట్ క్లినిక్‌కు మాత్రం రోజూ సమయానికి హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రతి నెలా జీతం అందుకుంటూ, ప్రైవేట్ ప్రాక్టీస్ పైన దృష్టి సారించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వైద్య వృత్తి నైతికతకు విరుద్ధమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వాసుపత్రులపై పేద ప్రజల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. కూటమి ప్రభుత్వ వైఖరి ఇందుకు కొంత కారణంగా కాగా వైద్యుల గైర్హాజరు, పరికరాల కొరత, మౌలిక సదుపాయాల లోపం, మందుల కొరత వంటి సమస్యలు కారణభూతమవుతున్నాయి. మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి ఇందుకు ప్రబల నిదర్శనం.