
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు!
●ఒంటిమిట్ట, పులివెందుల ప్రజలను ఓట్లు వేయనివ్వలేదు ●పక్క నియోజకవర్గాల ప్రజలతో దొంగ ఓట్లు వేయించారు ● వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అక్కడి ప్ర జలను ఓట్లు వేయనీయకుండా, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకు వచ్చి దొంగ ఓట్లు వేయించిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. గుణదలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఒంటిమిట్ట, పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, దానిపై పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ వీడియోలో, పోలింగ్ బూత్‌లో కలెక్టర్ పరిశీలన చేస్తున్నట్లు విడుదల చేసి న వీడియోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారని అన్నారు. అలా దొంగ ఓట్లు వేసిన వారిపై పోలీసులు, ఎన్నిక ల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని అవినాష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసి, అత్యంత దారుణంగా ఎన్నికలు నిర్వహించారని, ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. టీడీపీ గూండాలు దాడులు చేసి, గాయపడిన వైఎస్సార్‌సీపీ వారిపైనే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని అడ్డుకున్నారని, స్లిప్‌లు లాక్కుని తామే ఓటేశారని, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అవినాష్ మండిపడ్డారు. అధికార పార్టీ ఏ విధంగా గెలిచిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు.