
అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యం
అవనిగడ్డ: స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. విశాఖపట్నం రైల్యే స్టేషన్‌లో వీరిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఐ యువకుమార్ తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడివాకవారిపాలెంకు చెందిన గుడివాక రామకృష్ణ, అవనిగడ్డకు చెందిన విక్కుర్తి కార్తీక్‌నాఽథ్ స్థానిక శ్రీచైతన్య స్యూల్‌లో 9వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ బుధవారం స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి వెళ్లారు. స్కూల్ వదిలినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ యువకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నారని తెలుసుకుని అక్కడి రైల్వే పోలీస్ స్టేషన్‌లో వారిని భద్రంగా ఉంచి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పిల్లల తల్లిదండ్రులు వైజాగ్ వెళ్లి తమ పిల్లలను తీసుకుని వచ్చారు. సరదా కోసమే వీరు అంతదూరం వెళ్లినట్టు పోలీసులు చెప్పారు. కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.