
ఆప్మెల్ సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
తెలంగాణ డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాల తయారీ, పాత విడిభాగాలు మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఏపీహెచ్‌ఎంఈఎల్ సంస్థ అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర డెప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్‌ఎంఎల్(ఆప్మెల్)ను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. కార్మికులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ ఆప్మెల్ మిషనరీ, మానవ వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులు నిబద్ధతతో పనిచేసి ప్రపంచంతో పోటీ పడగలం అన్న నమ్మకం కలిగించాలని అన్నారు. సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమిస్తామన్నారు. స్థానిక పరిస్థితుల అధ్యయనం ద్వారా ఎలా ముందుకు పోవాలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. మిషనరీని పరిశుభ్రంగా ఉంచి, యంత్రాలకు ఓవరాలింగ్, రంగులు వేయాలని ఆదేశించారు. కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించి పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలో సింగరేణి కాలరీస్ కొత్త యంత్రాల తయారీ, పాత యంత్రాల మరమ్మతు వరకే పరిమితం కాకుండా దేశానికి అవసరమైన ఆర్డర్లు తీసుకొని భెల్ కంపెనీ మాదిరిగా థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన యంత్రాల తయారీ, యంత్రాల మరమ్మతు చేయాలన్నారు.