
కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఏటిపాయ వరదతో పోటెత్తిన బుడమేరు పంట పొలాలకు పొంచి ఉన్న ముంపు భయం ఆందోళన చెందుతున్న అన్నదాతలు కృష్ణా, బుడమేరు పరిసర గ్రామాల్లో అధికారుల పర్యటన
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
స్వాతంత్య్ర దినోత్సవ సందడి
వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవ సందడి నెలకొంది. విజయవాడ నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల విక్రయాలు జోరుగా సాగాయి.
దుర్గమ్మకు పలువురి విరాళాలు
విజయవాడ దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. నిత్యాన్నదానం పథకం కోసం ఈ విరాళాలు ఆలయ అధికారులకు అందజేశారు.
కంకిపాడు/అవనిగడ్డ: ఒక వైపు కృష్ణమ్మ, మరో వైపు బుడమేరు ఉగ్రరూపం దాల్చాయి. పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంట గంటకూ నీటి ప్రవాహ ఉధృతి పెరుగుతుండ టంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు స్తంభించే పరిస్థితి నెలకొంది.
వరదెత్తిన కృష్ణమ్మ
విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నది దిగువకు భారీగా నీటిని వదిలారు. దీంతో వరదనీరు కడలి వైపు పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే 5.52 లక్షలు క్యూసెక్కులను అధికారులు విడుదల చేయడంతో కృష్ణానది ఏటిపాయ వరదతో పోటెత్తింది. గురువారం మధ్యాహ్నానికి ఏటిపాయ అంచుల నుంచి కరకట్టకు వెళ్లే రహదారుల్లోకి, కరకట్టకు దిగువనున్న పంట కాలువల్లోకి వరదనీరు చేరింది. పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాలతో పాటుగా పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాల చుట్టూ వరద నీరు చుట్టేసింది. లంక గ్రామాల ప్రజలు పడవల సాయంతో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. లంక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. లంక భూములను వరద ముంచే ప్రమాదం ఉంది. వరద ప్రవాహం పెరిగితే దివిసీమలోని పలు గ్రామాలు నీటమునిగే ప్రమాదముంది. ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో వేసిన రహదారి వరదలకు కొట్టుకు పోవడంతో రాకపోకలు స్తంభించాయి.
పంట పొలాలకు ముంపు ముప్పు
కృష్ణానది కరకట్ట, బుడమేరు పరిసరాల్లో పంట పొలాలకు ముంపు భయం పొంచి ఉంది. ఇప్పటికే కృష్ణానది, బుడమేరు ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. కరకట్ట దిగువున ఉన్న పంట పొలాల చుట్టూ నీరు చేరింది. ఎగువ నుంచి వరదనీరు ఇంకా విడుదల చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు పరిధిలోని కేసరపల్లి, మురుగుకాలువ పరిధిలోని జగన్నాధపురంలో ఇప్పటికే 100 ఎకరాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి. బుడమేరు ఉధృతి పెరిగే పంట పొలాల ముంపు అధికమయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అప్రమత్తమైన అధికారులు బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉయ్యూరు ఆర్డీఓ హెలా షారోన్ నేతృత్వంలోని అధికారుల బృందం పరిస్థితిని సమీక్షించింది.
శాస్వతంగా ఊరొదిలేస్తాం
అవనిగడ్డ మండలంలోని ఎడ్లంకను వరద ముంచెత్తింది. ఈ గ్రామానికి వెళ్లే కాజ్‌వే రోడ్డు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు పడవ ప్రయాణం సాగిస్తున్నారు. ఎడ్లంక పల్లెపాలెంలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన తిరుపతమ్మ ఆలయం వరదలకు కోతకు గురైంది. వరద పెరిగితే ఈ ఆలయం నీటమునుగుతుంది. తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరావు, సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఎడ్లంక గ్రామంలో గురువారం పర్యటించి, వరద ఉధృతి పెరుగుతున్నందున పునరావాస కేంద్రానికి తరలి రావాలని గ్రామస్తులను కోరారు. దీంతో కొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద వచ్చినప్పుడే తమ ఊరు, తాము గుర్తుకొస్తున్నామని, తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన ఊసేలేదని, రక్షణ గోడ నిర్మానాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు పడలేమని శాస్వతంగా ఊరు వదిలి వెళ్లిపోతామని చెప్పారు.
ఉధృతంగా బుడమేరు
బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. గత సెప్టెంబర్‌లో పంట పొలాలుపై విరుచుకుపడిన బుడమేరు ఈ ఏడాది ఖరీఫ్ తొలి నాళ్ల లోనే ఉధృతంగా ప్రవహిస్తోంది. కంకిపాడు మండలం వేల్పూరు, ఉప్పలూరు, మంతెన, తెన్నేరు మీదుగా బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో వైపు ఏనుగుల కోడు నీటితో నిండుగా ప్రవహిస్తోంది. గొడవర్రు వద్ద కట్ట మీదుగా ఏనుగుల కోడు వెళ్తోంది. సమీపంలోని వరి పొలాలు నీటమునిగాయి.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా