
వ్యాధుల ముప్పు.. అప్రమత్తతే మందు
వర్షాలు, వరదల నేపథ్యంలో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు అంటువ్యాధులు, సీజనల్ జ్వరాలు ప్రబలుతాయని హెచ్చరిక కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యుల సూచన
వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కుసిరిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని పలు కాలనీలు నీటమునిగాయి. అన్ని రోడ్లలో మురుగుతో కలిసి వర్షపునీరు తిష్టవేసింది. దీంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద ప్రాంతాలతో పాటు, అన్ని ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూడా లని, తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలని స్పష్టంచేస్తున్నారు.
అంటు వ్యాధుల భయం
● వరదలు వచ్చిన ప్రాంతంలో ఆహారం, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో వాంతులు, విరేచనాలు, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధుల లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడవచ్చు.
● వరద ప్రాంతాల ప్రజలు కొన్ని రోజుల పాటు చేతి పంపులు, కుళాయిల ద్వారా వచ్చే నీటిని తాగకుండా ఉండటం మంచింది. మంచినీటి పైపులు, డ్రెయిన్లు పక్కపక్కనే ఉంటే, ఆ రెండింటిలో నీరు కలిసే ప్రమాదం ఉంటుంది. ఇలా నీరు కలిసి కలుషితమైతే అనేక రకాల బ్యాక్టీరియాలతో పాటు, ఈ–కోలి వంటివి శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి.
● ఆర్‌ఓ వాటర్ బాటిళ్లలోని నీరు కూడా సురక్షితమని చెప్పలేం. ఆ నీటిని కూడా 30 నిమిషాల పాటు కాచి చల్లార్చి తాగితే మంచిది.
● వరద ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని రోజుల పాటు బయట ఆహారం తినకూడదు.
ఇప్పటికే ప్రబలిన జ్వరాలు
ఇప్పటికే విజయవాడతో పాటు, ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఉన్నాయి. ఇప్పుడు వరద నేపథ్యంలో అవి ఇంకా విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
● నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెందితే మలేరియా, డెంగీ, గున్యా వంటి విషజ్వరాలు సోకుతాయి. ప్రస్తుతం నగరంలో ఈ జ్వరాలు ఉన్నందున, ఈ వరదతో మరింత పెరిగే అవకాశం ఉంది.
● ఈగల ద్వారా కూడా బ్యాక్టీరియా ఆహార పదార్థాలపైకి చేరి వ్యాధులు సోకే అవకాశం ఉంది.
● విజయవాడలో ఇప్పటికే పారిశుద్ధ్య సమస్య ఉన్న నేపథ్యంలో వరదలతో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
వర్షాలతో పలు కాలనీల్లో నీళ్లు రావడంతో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా కాలనీల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 24 శిబిరాలు ఏర్పాటు చేశాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ మాచర్ల సుహాసిని,
డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌జిల్లా