
బుడమేరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
జి.కొండూరు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండలంలోని వెలగలేరు వద్ద బుడమేరుపై ఉన్న హెడ్ రెగ్యులేటర్‌ను ఆయన గురువారం ఉదయం పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ గేట్ల పనితీరు, వరద ప్రవాహం, డైవర్షన్ కెనాల్ సామర్థ్యం వంటి అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. బుడమేరులో సాధారణ వరద ప్రవాహం కొనసాగుతున్నందున డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తోందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బుడమేరుకు వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. అనంతరం కొండపల్లి శాంతినగర్ వద్ద ఇటీవల బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు నిర్మించిన రిటైనింగ్‌వాల్, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.