
కక్షిదారుల సౌలభ్యం కోసం ఈ–సేవ కేంద్రాలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ
చిలకలపూడి(మచిలీపట్నం): కక్షిదారులు, న్యాయవాదుల సౌలభ్యం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ–సేవ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ–సేవ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ.. ఈ కేంద్రాల ద్వారా ఉచితంగా కక్షిదారులకు, న్యాయవాదులకు కేసుల పరిస్థితి, తదుపరి విచారణ తేదీలు వంటి వివరాలను తెలు పుతారని వివరించారు. సెలవులో ఉన్న న్యాయ మూర్తుల వివరాలను కూడా తెలియజేస్తారని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. న్యాయపరమైన ఆదేశాలు, తీర్పులు, సాఫ్ట్ కాపీలను ఈ–మెయిల్, వాట్సాప్, అందుబాటులో ఉన్న ఇతర యాప్‌ల ద్వారా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. న్యాయశాఖలో తర్ఫీదు పొందిన సిబ్బంది ఈ–సేవ కేంద్రాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్జి జి.వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోతురాజు, న్యాయవాదులు ఎల్.బాలాజీ, నగధర్‌నాథ్, పుప్పాల కామేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.