
ముంచెత్తిన వాన
చిలకలపూడి(మచిలీపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 83.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో పమిడిముక్కల మండలం ఐనంపూడి గ్రామంలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని రత్నకోడు, గుండేరు డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. ఈ ఆయకట్టులోని పొలాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం వేసిన నాట్లు నీటి ఒరవడికి కొట్టుకుపోయాయి.
జిల్లాలోని నియోజకవర్గాల్లో నీట మునిగిన పొలాలు
● మచిలీపట్నం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చిన్నాపురం, గొల్లపాలెం, సింహాచలం, నెలకుర్రు తదితర గ్రామాల్లోని పంటపొలాలు నీటమునిగాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) నీటమునిగిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికై నా రైతు కష్టాలను పరిశీ లించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓవైపు ఎరువుల కొరత, మరోవైపు అధిక వర్షాల కారణంగా పొలాలు దెబ్బతినడంతో రైతులు కుదేలవుతున్నారన్నారు.
● పెడన నియోజకవర్గంలోని పెడన మండలంతో పాటు బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అధిక వర్షం నమోదుకాగా కృత్తివెన్ను మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో ఎటువంటి పంటనష్టం జరగలేదు.
● అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షం కారణంగా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామంలో చెట్లు పడిపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నియోజకవర్గ పరిధిలోని రత్నకోడు, గుండేరు డ్రెయిన్ల పరిధిలో పొలాలు మునిగాయి. కోడూరు, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నియోజకవర్గ పరిధిలో రాత్రి 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థ పడ్డారు.
● పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, పామర్రు, పెదపారుపూడి, తోట్లవల్లూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట కాలువల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. మొవ్వ మండలంలోని కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు.
● గుడివాడ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి పంట పొలాలు పరిస్థితి బాగానే ఉన్నా రెండు, మూడు రోజులు వర్షం ఇలానే కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుడివాడ పట్టణంలోని బస్టాండ్ తదితర పల్లపు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. బుడమేరుకు పైనుంచి వరద రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
● పెనమలూరు నియోజకవర్గ పరిధిలో కూడా అధిక వర్షపాతం నమోదైంది. గాలి, వాన రావడంతో గంటసేపు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వరి పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
● గన్నవరం నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఐనంపూడిలో పిడుగుపడి పశువుల పాక దగ్ధం, మూడు పశువులు మృతి పొంగిపొర్లుతున్న రత్నకోడు, గుండేరు డ్రెయిన్లు బుడమేరుకు పైనుంచి వరద పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కృష్ణాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
జిల్లాలో 83.4
మిల్లీమీటర్ల వర్షపాతం
జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 83.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చల్లపల్లి మండలంలో 177.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బాపులపాడు మండలంలో 0.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు పరిశీలిస్తే నాగాయలంక మండలంలో 143.8 మిల్లీమీటర్లు, అవనిగడ్డ 137.2, కోడూరు 126.8, కంకిపాడు 125.4, పామర్రు 120.4, గుడివాడ 114.4, మోపిదేవి 108.2, ఉయ్యూరు 106.2, గుడ్లవల్లేరు 105.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పమిడిముక్కల మండలంలో 102.6 మిల్లీమీటర్లు, నందివాడ 96.4, బంటుమిల్లి 87.2, పెనమలూరు 84.6, ఘంటసాల 83.2, తోట్లవల్లూరు 74.6, ఉంగుటూరు 65.6, పెదపారుపూడి 58.2, మొవ్వ 55.4, గన్నవరం 45.2, పెడన 40.0, మచిలీపట్నం నార్త్, సౌత్ 32.6, గూడూరు 28.8, కృత్తివెన్ను మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన