
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో పాఠశాల విద్య, నిర్మాణ అంశాలపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడతూ కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ దార్శనికత –2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంగా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్య మెరుగుదలకు విద్యాధికులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో పాఠశాల స్థాయిలో వారికి సబ్జెక్టుపై పట్టు సాధించానికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం చాలా ముఖ్యమని పేర్కొంటూ ఆ దశలో వారికి వేయాల్సిన అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు అందించాలని చెప్పారు. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని నైతిక విలువలు నేర్పిస్తూ మాదకద్రవ్యాల జోలికి పోకుండా చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదినీసింగ్, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ శర్మిష్ట, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు.