
బందరులో ‘క్విట్ కార్పొరేట్’ నిరసన
మచిలీపట్నంటౌన్: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశాన్ని అడ్డుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బుధవారం మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. వ్యవసారంగంలో ఇప్పటికే చిన్న కమతాల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 సెంట్లు భూమి కలిగిన చిన్న రైతులకు అన్నదాత భరోసా పథకం వర్తించడం లేదని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి అత్యధికంగా పండే ఆక్వా ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల భారం నుంచి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కాపాడాలన్నారు. ఇతర దేశాలకు సరుకు ఎగుమతుల్లో ప్రోత్సహించి రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర అదే విధంగా చూడాలని కోరారు. కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కోసూరు శివ నాగేంద్ర మాట్లాడుతూ అధిక వర్షాల బారిన పడి ముంపునకు గురైన వరి రైతులను ఆదుకోవాలన్నారు. వేలాది రూపాయల ఖర్చుపెట్టి వరి నాట్లు పూర్తి చేసిన రైతులకు నీటి ముంపు సమస్య తీరని నష్టం కలిగించిందన్నారు. డ్రెయిన్ల నిర్వహణ వేసవి కాలంలో చేపట్టి పనులు పూర్తి చేసి ఉంటే ముంపు నీరు త్వరగా తరలిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాల మేరకు ఉంటుందని ఆచరణలో అమలు జరగడం లేదన్నారు. రైతులు తమ పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఐటీయూ కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, నగర కన్వీనర్ సీహెచ్ జయరావు, బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు ఎండీ యూనస్ తదితరులు పాల్గొన్నారు.