
గణపతి ఉత్సవాల్లో ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: గణపతి నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు కోరా రు. ఉత్సవ కమిటీలు, యువత పోలీసు శాఖ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఆయన పందిళ్ల నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిర్వాహకులు మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డీజే బాక్సులు, బాణసంచాకు అను మతి లేదన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్లు ఆక్రమించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారులు, ఉత్స వకమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బీరువా పగులగొట్టి నగలు చోరీ
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలను చోరీకి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాపురం పరిధిలోని పైపుల రోడ్డు సమీపంలోని కృష్ణ బాబాయి హోటల్ వద్ద పన్నేరి దుర్గాప్రసాద్ తన భార్య సుమతో కలిసి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. దుర్గాప్రసాద్ ఎసీ టెక్నిషియన్‌గా పని చేస్తుంటాడు. ఈ నెల 10వ తేదీన దుర్గాప్రసాద్ భార్యకు ఇంట్లో సీమంతం జరిగింది. అదే రోజు సాయంత్రం సుమా పుట్టింటికి వెళ్లింది. 12వ తేదీ మధ్యాహ్నం దుర్గాప్రసాద్ తన ఇంటికి వచ్చి భార్యకు కావాల్సిన కొన్ని బట్టలు తీసుకుని అత్త గారి ఇంటికి వెళ్లాడు. అయితే బట్టలు సరిపోలేదని మరో డ్రెస్ తెచ్చేందుకు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి కనిపించాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసి కనిపించాయి. బీరువాలో ఉండాల్సిన నాలుగు గ్రాముల బంగారు నల్లపూసలు, 3 గ్రాముల బంగారపు చెవిదిద్దులు, 300 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అమరేశ్వరుని పవిత్రోత్సవాలు ప్రారంభం
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

గణపతి ఉత్సవాల్లో ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు