
పోలీసుల అదుపులో ఇద్దరు బాల నేరస్తులు
గన్నవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్తులను గన్నవరం పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఈ ఏడాది జూలై 22న ఐదుగురు బాల నేరస్తులు పారిపోయారు. వీరిలో ఇద్దరు హయత్‌నగర్, చౌటుప్పల్‌లో రెండు బైక్‌లను చోరీ చేసుకుని విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక దావాజీగూడెం రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కింగ్ చేసి ఉన్న రెండ్ బైక్‌లు ఈ నెల 6వ తేదీ రాత్రి అపహరించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ శ్రీధర్ నేతృత్వంలోని సిబ్బంది సాంకేతిక ఆధారాలు మేరకు స్థానిక కోనాయి చెరువు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇరువురు బాల నేరస్తులను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 4.30 లక్షల విలువైన మూడు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గురించి హైదరాబాద్‌లోని జువైనెల్ హోమ్‌కు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు.