
దుర్గమ్మ సన్నిధిలో 16న కృష్ణాష్టమి వేడుకలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 16వ తేదీ శనివారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. లక్ష్మీ గణపతి విగ్రహం ఎదురుగా ఉన్న గోశాల వద్ద గోమాతకు విశేష పూజలు, సాయంత్రం 5 గంటలకు మహా మండపం కళావేదికపై దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం రాజగోపురం ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
19, 20 తేదీల్లో దరఖాస్తుల పంపిణీ..
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు 19, 20వ తేదీలలో దరఖాస్తులను అందిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 22వ తేదీ 5వ శుక్రవారం మహా మండపం ఆరో అంతస్తులో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్న సంగతి తెలిసింది. ఈ వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు మహా మండపం గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్న దేవస్థాన టోల్ ఫ్రీ కార్యాలయంలో ఉదయం నుంచి దరఖాస్తుల పంపిణీ జరుగుతుందన్నారు. దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి తిరిగి కార్యాలయంలో అందచేయాలని తెలిపారు.