
ప్రజలపై ‘స్మార్ట్’ భారం!
గుడివాడరూరల్: స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును ప్రజలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా రాష్ట్రంలోని కూటమి సర్కార్ లెక్కచేయడం లేదు. ప్రజలపై భారంపై మోపడానికి అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు. త్వరలో గృహ సముదాయాలు, వ్యవసాయ కనెక్షన్లకు ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధమవుతుంది. ప్రీపెయిడ్ ఆప్షన్‌తో వీటిని రూపొందించారు. మొబైల్, కేబుల్ టీవీల తరహాలోనే ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్‌గా సరఫరా నిలిచిపోతుంది. మొబైల్ చార్జర్ ఆన్‌చేసినా విద్యుత్ వాడినట్లు బిల్లు వచ్చేస్తుంది. పేదల కష్టార్జితం ‘స్మార్ట్’ బిల్లులు కట్టడానికే సరిపోయేలా ఉంది.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 6,65,266 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిలో ప్రభుత్వ సంస్థలవి 11,399 ఉండగా, ప్రైవేట్ కనెక్షన్లు 6,53,867 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 211.411మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికి ప్రతి నెలా రూ.87.92 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నారు. తొలుత కేవీ, నాన్ అగ్రికల్చర్, ప్రభుత్వ సర్వీసులు, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్లకు విద్యుత్‌శాఖ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిల్లాలో ఇప్పటికే 62,197కు పైగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. అనంతరం గృహ సముదాయాలకు ఏర్పాటు చేయడానికి యత్నాలు చేస్తున్నారు. 500 యూనిట్ల పైబడి విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు బిగించడానికి రంగం సిద్ధమవుతోంది. దీన్ని వినియోగదారులు, వామపక్షాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా వీటిని పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్ బిగించుకోకపోతే ప్రస్తుతం ఉన్న మీటర్‌కు కమర్షియల్ బిల్లు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేసే అధికారం విద్యుత్‌శాఖకు లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నా ఆ శాఖ అధికారులు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న చంద్రబాబు, లోకేష్..
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ప్రస్తుతం వీటిని ప్రోత్సహించడంపై వినియోగదారులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బోరుబావుల వద్ద స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే వాటిని ధ్వంసం చేయండని రెచ్చగొట్టిన చంద్రబాబు, లోకేష్‌లు ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు కూటమి దూకుడు జిల్లాలో 62,197కుపైగా విద్యుత్ మీటర్ల ఏర్పాటు మీటర్లు వద్దంటే బెదిరింపులు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్
ముందే రీచార్జ్ చేసుకోవాలి
ప్రస్తుతం నెలంతా విద్యుత్ వినియోగించుకుని బిల్లు వచ్చిన అనంతరం చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో అలాంటి ప్రక్రియకు చెక్ పడుతుంది. సెల్‌ఫోన్, డిష్‌టీవీ తరహా ముందస్తుగా స్మార్ట్ మీటర్‌కు రీచార్జ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ పూర్తవగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. పీక్ సమయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడు తుంది. వేసవిలో అధిక చార్జీలు వసూలు చేసే అవకాశముంది.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు
డివిజన్ కేటగిరి–1 కేటగిరి–2 కేటగిరి–3 కేటగిరి–4 క్యాటగిరి–5
గుడివాడ 2,20,542 24,571 713 5439 19,535
ఉయ్యూరు 1,22,769 12,106 318 3323 18,206
మచిలీపట్నం 1,97,718 21,666 950 5625 11,785
విద్యుత్ రంగాన్ని కేంద్రం కంట్రోల్‌లోకి తీసుకోవడం సరికాదు
విద్యుత్ రంగం ఎప్పటి నుంచో రాష్ట్రాల కంట్రోల్‌లో ఉండేది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తమ కంట్రోల్‌లోకి తీసుకోవడం సరికాదు. దీంతో పేద ఎస్సీ వర్గాలు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేతులో కీలుబొమ్ముగా మారింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేసిన తర్వాత దుకాణాలు, చిన్న చిన్న ఇండస్ట్రియల్ వ్యాపారులకు వస్తున్న బిల్లులు చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలి. లేనిపక్షంలో ప్రజలతో కలసి పోరాటాలు ఉధృతం చేస్తాం.
–ఆర్సీపీ రెడ్డి, సీపీఎం నేత, గుడివాడ

ప్రజలపై ‘స్మార్ట్’ భారం!

ప్రజలపై ‘స్మార్ట్’ భారం!