
నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బెంగుళూరుకు చెందిన భక్తులు బుధవారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన పిళ్లా రవి దంపతులు కుటుంబం సమేతంగా అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ. 2 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఏఈవో ఎన్.రమేష్‌బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
సాగరంలో ‘అల’జడి
కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం ఉదయం నుంచి పాలకాయతిప్ప బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు ముందుకు చొచ్చుకురావడంతో పాటు తీరంలో ఈదురుగాలుల తీవ్రత అధికమైంది. సముద్ర స్థితిగతుల్లో మార్పు కనిపిస్తోందని పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు తెలిపారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు భారీగా కోతకు గురై భయానకంగా మారింది. భారీ వర్షాలు కూడా ఉండటంతో తీరంలో అలజడి నెలకొంది.
గ్రంథాలయాలకు
కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రంథాలయాల ద్వారా పౌరులకు డిజిటల్ సేవలు అందించేందుకు శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్, శిక్షణ ఫౌండేషన్, బెంగుళూరు గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కృష్ణా జిల్లాలోని 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేశారు. బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రాజెక్టు మేనేజర్ వి. స్వాతిదేవ్ ఆయా గ్రంథాలయాలకు అందజేశారు. డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేసి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు అందజేశారన్నారు. యువతకు, నిరుద్యోగులు, విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ వ్యవస్థ ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతిదేవ్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రంథాలయాలకు 2 కంప్యూటర్లు, ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ టీం ప్రతినిధులు డి. సత్యనారాయణ, రాజారావు, ఎ.బుచ్చిబాబు, ఎ. కార్తీక్, కార్యదర్శి వి. రవికుమార్ ఠాగూర్ గ్రంథాలయాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కానూరులో జాతీయ వాలీబాల్ పోటీలు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో ఆలిండియా ఇన్విటేషన్ వాలీబాల్ పోటీల వేదికగా మార్చారు. మూడు రోజులుగా విజయవాడ పీబీ సిద్ధార్థలో జరుగుతున్న పోటీలను వర్షం కారణంగా కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో పోటీలను బుధవారం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. లీగ్ విభాగంలో మహిళల పోటీలో తమిళనాడు స్పోర్ట్స్ అకాడమీ జట్టు కేరళ అజంష్షన్ కాలేజీపై గెలిచింది.ఏపీ ఎంసీఎఫ్ జట్టు చైన్నె ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో చైన్నె ఎస్‌ఆర్‌ఎం జట్టు గుజరాత్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, తివేండ్రం స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా జట్టు కేరళ హోలీ గ్రేస్ జట్టుపై గెలిచింది. నాకౌట్ పోటీలు పూర్తయ్యాయని, లీగ్ పోటీలతో టోర్నమెంట్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం

నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం

నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం