
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీజీపీ మధుసూదనరెడ్డి, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, ఐజీ బి.రాజకుమారి, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.