
వంకలు
వందనానికి
రూ.10,900 మాత్రమే జమ చేశారు
తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా మందికి రూ.13 వేల చొప్పున అందించింది. మాకు రూ.10,900 మాత్రమే అందాయి. మా మండలంలో చాలా మందికి రూ.10,900 చొప్పునే అందాయి. దీనిపై సచివాలయంలో విచారిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన నగదు అందుతుందని సమాధానమిచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకం కదా? కేంద్రం ఎందుకు ఇస్తుందో అర్థమవడం లేదు.
– సీహెచ్ బుచ్చిబాబు, మైలవరం మండలం
ఉచిత సీటు పేరుతో ఎసరు
విద్యాహక్కు చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న క్రమంలో మా బాబుకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీటు కేటాయించారు. ఆ పేరుతో తల్లికి వందనం పథకం వర్తించదంటూ నిలిపివేశారు. అయితే రెండు వైపులా మాకు ప్రభుత్వం అన్యాయమే చేస్తోంది. మా బాబుకు కేటాయించిన సీటు పొందిన విధంగానే చాలా మందికి ఈ పథకాన్ని నిలిపివేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక పరిస్థితులు కలిగిన అందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలి.
– పి.జ్యోత్స్నాదేవి, విజయవాడ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తల్లికి వందనం పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సాకులు వెదుకుతోంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పెద్దలు హామీలు గుప్పించారు. అయితే తొలివిడత కొందరికే ఈ పథకం వర్తింపజేశారు. రూ.15 వేలకు బదులు రూ.13 వేలు మాత్రమే అందజేశారు. అర్హత ఉన్నా పథకం అందని పిల్లల తల్లిదండ్రుల నుంచి విమర్శలు రావడంతో రెండో విడత వారికి నగదు అందజేస్తామని, గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం సూచించింది.
అనేక వంకలు.. అరకొరగా అమలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలు అందరూ చదువుకోవాలని, వారి చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని అమ్మ ఒడి పథకాన్ని అమలుచేశారు. ఆ పథకం పేరును తల్లికి వందనంగా మార్చిన కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ అమలుచేస్తామని గొప్పలు చెప్పింది. అమలులోకి వచ్చేసరికి అనేక వంకలు చూపుతూ వేల మందికి ఎగనామం పెట్టిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2023లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలనలో 3,00,120 మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకం నగదు జమయింది. కూటమి ప్రభుత్వం 2024లో తల్లికి వందనానికి ఎగనామం పెట్టింది. 2025 జూన్‌లో 2,53,457 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది. సుమారుగా 46,663 మంది తల్లులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. ఆ తల్లులకు సంబంధించి సుమారుగా 70 వేల నుంచి 75 వేల మంది పిల్లలకు ఈ పథకాన్ని ఎగ్గొట్టిందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
అమలులోనూ అరకొరగానే నిధులు
తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి పిల్లవాడికి రూ.15 వేలు అందిస్తామని, అందులో ఎటువంటి కోతలు పెట్టబోమంటూ ప్రకటించింది. అయితే రూ.13 వేల చొప్పునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరికి రూ.10,900 చొప్పున, కొంత మందికి రూ.9 వేల చొప్పున జమ చేసింది. అదేమని ప్రశ్నిస్తే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడతాయంటూ సచివాలయ సిబ్బందితో చెప్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాపితంగా విద్యాహక్కు చట్టంలో భాగంగా అర్హత కలిగిన చిన్నారులకు ప్రభుత్వం ఉచితంగా ఆయా సమీప ప్రైవేటు విద్యాసంస్థల్లో సీట్లు కేటాయించింది. ఆ చిన్నారులకు తల్లికి వందనం పథకాన్ని నిలిపివేసింది.
తల్లికి వందనం నగదు కోసం అర్హులకు తప్పని ఎదురుచూపులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 70 వేల మందికి అందని నగదు సచివాలయాల్లో బారులు తీరి అర్జీలుసమర్పించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్‌లో జరిగే స్పందనలోనూ అధికారులకు అందిన దరఖాస్తులు పాఠశాలల ఎదుట ధర్నాలకుదిగుతున్న తల్లిదండ్రులు
పాఠశాలల ఎదుట ధర్నాలకు దిగుతున్న తల్లిదండ్రులు
సచివాలయాల్లో వందలాదిగా దరఖాస్తులు
తల్లికి వందనం పథకానికి అర్హత ఉండి నగదు జమ కాని విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమీప వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులంతా సమీప సచివాలయాల్లో, ప్రతి సోమవారం కలెక్టరేట్‌లలో జరుగుతున్న స్పందన కార్య క్రమంలో దరఖాస్తులు చేసుకున్నారు. కలెక్టర్లకు వస్తున్న దరఖాస్తులను డీఈఓ కార్యాలయాలకు పంపిస్తున్నారు. సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను సెక్రటరీలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే వాటికి స్పందించి పథకం అమలవుతున్న తీరు మాత్రం ఎక్కడా కనపడటం లేదు.
అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని ఆందోళనలు చేపడుతున్నారు. మైలవరంలోని నారాయణ విద్యాసంస్థ హెచ్‌ఎం కార్యాలయం వద్ద సోమవారం తల్లిదండ్రులు బైఠాయించారు. తమకు ఎందుకు పథకం అమలు కాలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో చాలా విద్యాసంస్థల్లో ఈ విధమైన ఆందోళనలు జరిగాయి. ఆయా పాఠశాలల యజమాన్యాలు తల్లిదండ్రులను డీఈఓ కార్యాలయాలకు, సచివాలయాలకు వెళ్లి నిలదీయాలంటూ పంపించి వేస్తున్నారు.

వంకలు

వంకలు

వంకలు