ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదు
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): అనాథ పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఎంతో మందికి ఆదర్శనీయులని, ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో కె. చంద్రశేఖరరావుతో కలిసి జిల్లాలోని వివిధ శిశుగృహల్లో ఉంటున్న ముగ్గురు చిన్నారులను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా జిల్లా బాలల రక్షణ విభాగం (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు జంటలకు దత్తత ఇచ్చి పత్రాలను అందించారు. మచిలీపట్నం శిశు గృహ నుంచి హిమాన్షు అనే ఏడు నెలల బాబుని చిత్తూరు జిల్లాకు చెందిన పీఎస్ ప్రసాద్ సుజాత దంపతులకు, బుద్ధవరం శిశు గృహ నుంచి రెండున్నర సంవత్సరం వయసున్న పాపని హైదరాబాద్‌కు చెందిన వికాస్ పంక్వని మనీషా దంపతులకు, అదేవిధంగా నాలుగేళ్ల సుశాంత్ అనే బాలుడిని బెంగళూరుకు చెందిన కృష్ణా నందిని దంపతులకు కారా ద్వారా దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులను బాగా చూసుకొని, మంచిగా చదివించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.


