దడ పుట్టిస్తున్న ఇసుక లారీలు
ఓవర్ లోడ్‌తో రోడ్లపై ప్రయాణం
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం
చోద్యం చూస్తున్న అధికారులు
పెనమలూరు: సామాన్యలు హెల్మెట్ ధరించక పోతే కేసు.. ఆటో రోడ్డు మార్జిన్‌లో నిలిపితే ట్రాఫిక్ సమస్య కారణంగా కేసు.. మరి ఇసుక లారీలు ఓవర్ లోడ్‌తో నిత్యం రద్దీగా ఉండే బందరు రోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా దడపుట్టిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నా ఎటువంటి కేసులు ఉండవు.. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఇది పోలీసులు, రవాణా శాఖ అధికారుల తీరు. అధికారుల వైఖరి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఇసుక లారీలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. చోడవరం, మద్దూరు ఇసుక క్వారీ నుంచి ఇసుక తరలించే లారీలు ఎటువంటి నిబంధనలు పాటించటం లేదు. లారీలో 40 నుంచి 60 టన్నులు ఇసుక లోడ్‌తో లారీలు జనావాసాల మీదగా ప్రయాణించటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రోడ్డుపై ఓవర్ లోడ్‌తో ఉన్న కంకర టిప్పర్ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది వరకు మృతి చెందిన ఘటనతో ఇక్కడి జనాలు టిప్పర్ లారీని చూస్తేనే ఆందోళన చెందుతున్నారు. ఓవర్ లోడ్‌తో ఉన్న లారీలకు అడ్డూ అదుపు లేకుండా ప్రయాణిస్తున్నాయని ప్రజలు ప్రాణభయంతో ఉన్నారు.
గ్రామాల్లో ఆందోళన చెందుతున్న ప్రజలు
ఓవర్ లోడ్ ఇసుకతో లారీలు చోడవరం ఇసుక క్వారీ నుంచి గ్రామాల మీదుగా జాతీయ విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి పైకి చేరుకుంటున్నాయి. టీడీపీ నాయకులు ఇసుక క్వారీ నిర్వహిస్తుండటంతో లారీలో భారీగా ఇసుక లోడ్ వేస్తున్నారు. ఒకేసారి 60 టన్నుల లోడ్ వేయటంతో లారీ భారీ చప్పుడు చేస్తూ కదలటంతో రోడ్డుపై ప్రయాణించే ప్రజలు కంగారు పడుతున్నారు. లారీ బాడీ కంటే పైకి ఇసుక వేయటంతో ఇసుక జారి రోడ్డుపై వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనదారులపై లారీలో ఇసుక కుప్పలు పడే ప్రమాదం పొంచి ఉంది. బందరు రోడ్డుపై ఇసుక లారీలు కారణంగా తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.
ట్రాఫిక్ వేళల్లో..
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డుపై ఉదయం, సాయంత్రం బిజీ సమయాలలో ఇసుక లారీలు తిరుగుతుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పోరంకి – నిడమానూరు రోడ్డులో విద్యుత్ వైర్లకు తగులుతూ ఓవర్ లోడ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. విద్యుత్ వైర్లు ఎక్కడ తెగిపడతాయోనని ప్రజలు భయపడుతున్నారు. ట్రాఫిక్ సమయాలలో ఇసుల లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని, నిడమానూరు రోడ్డులో ఇసుక లారీల ప్రవేశం నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.
సురక్షిత ప్రయాణం ఎలా చేయాలి..?
బందరు రోడ్డుపై ఓవర్ లోడ్‌తో ఇసుక లారీలు తిరుగుతుంటే సురక్షిత ప్రయాణం ఎలా చేయగలుగుతామని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రోడ్డు భద్రతపై అధికారులు కార్యక్రమాలు నిర్వహించి చేతలు దులుపుకుంటే సరిపోదని ఆచరణలో అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నా, చితక వాహనదారులపై కేసులు రాసి పోలీసులు టార్గెట్‌లు పూర్తి చేయటం కాదని, ఓవర్‌లోడ్‌తో ఉన్న వాహనాల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేటికి లారీలపై ఒక్క కేసైనా నమోదు చేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా రవాణా, పోలీసు అధికారులు స్పందించి ఓవర్‌లోడ్ లారీలపై కొరడా ఝలిపించాలని ప్రజలు కోరుతున్నారు.
దడ పుట్టిస్తున్న ఇసుక లారీలు


