
కమిషనర్ అత్యుత్సాహం
పేదల ఇళ్లు కూల్చివేతకు
బందరులో గృహాల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్తత
మచిలీపట్నంటౌన్: నగరంలోని కాలేఖాన్‌పేట మురుగుకాలువ సెంటర్‌లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు పేదలకు చెందిన నివాస గృహాలను ఈ నెల 10వ తేదీ వరకూ తొలగించవద్దని స్థానిక కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా భారీ పోలీసు పహారా నడుమ వాటిని కూల్చేందుకు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీహరిప్రసాద్ సిబ్బందితో రావటం వివాదానికి కారణమైంది. నగరంలోని 30వ డివిజన్ కాలేఖాన్‌పేటలో దేవీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం ఎదురుగా మురుగుకాలువ గట్టుపై 40 ఏళ్లకు పైగా బడే లక్ష్మీరాజ్యం, దాసరి సుజన కుమారి, మాదాసు కనకదుర్గ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఒకవైపు ఆర్‌అండ్‌బీ రోడ్డు మరో పక్క మురుగుకాలువ గట్టుపై ఉన్న నివాసాలు ట్రాఫిక్‌కు సైతం ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ టీపీఓ వాటిని పొక్లెయినర్లతో తొలగించేందుకు రావటంతో ఆ ప్రాంతానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కోసూరి ముసలయ్య, మిరియాల రాంబాబు, కోసూరి లక్ష్మీనాంచారయ్య గత రెండు రోజులుగా అధికారుల తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర కమిషనర్ బాపిరాజు మంగళవారం ఈ గృహాలను తొలగించాలంటూ టీపీఓను పంపటంతో మళ్లీ వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), కార్పొరేటర్‌లు, నాయకులు పేదలకు అండగా నిలిచారు. గృహాలను తొలగించే ప్రయత్నం చేసిన టీపీఓకు కోర్టు ఆర్డర్‌ను చూపించి, కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి ఎలా కూలుస్తారని కిట్టు ప్రశ్నించారు. ఎవరు కూల్చమన్నారని అడగ్గా కమిషనర్ ఓరల్‌గా చెప్పారని టీపీఓ బదులిచ్చారు. ఓరల్‌గా చెప్తే ఎవరి ఇల్లయినా కూల్చేస్తారా.. ఇదెక్కడి న్యాయం.. అని నిలదీశారు. ఈ విషయమై మాట్లాడేందుకు కమిషనర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవటంతో ఆయన వచ్చేవరకూ ఇక్కడే ఉంటామని కిట్టు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడే బైఠాయించారు. అక్కడ విధులకు వచ్చిన ఎస్‌ఐలకు కూడా కోర్టు ఆర్డన్‌ను చూపించి కోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా నిర్వహించే తొలగింపునకు మీరు ఎలా పహారా కాస్తారని ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని ఫోన్‌లో వివరించారు. ఈ దశలో కమిషనర్ బాపిరాజు అక్కడకు వచ్చారు. కోర్టు ఆర్డర్ ఉండగా ఎలా కూలుస్తారని కిట్టూ ఆయన్ను ప్రశ్నిస్తున్నా ఆయన పట్టించుకోకుండా గృహాలు కూల్చాలని జేసీబీ డ్రైవర్‌లకు పలుమార్లు సైగ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన పేర్ని కిట్టు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఒక్కసారిగా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చి కూటమి నాయకుల మన్ననలు పొందాలని చూస్తున్నావా, కమిషనర్‌లా కాకుండా ఓ వీధి రౌడీలా వ్యవహరించటం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ఈ దశలోనే బాధితులు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మీద పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. బాధితుల వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్, టిన్నులను అక్కడున్న పోలీసులు లాక్కున్నారు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన కమిషనర్ మధ్యాహ్నం దేవీ నాంచారమ్మ ఆలయం వద్దకు వచ్చి బాధితులకు జీ ప్లస్–3 గృహాలను కేటాయిస్తామని అమ్మవారి సాక్షిగా హామీ ఇచ్చారు. గృహాలను కేటాయించిన తర్వాతే ఈ గృహాలను తొలగించాలని నాయకులు కమిషనర్‌ను కోరగా అంగీకరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర క్లస్టర్ అధ్యక్షుడు మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, మండల వెస్ట్ జోన్ అధ్యక్షుడు మట్టా నాంచారయ్య, మాజీ పీపీ కొక్కిలిగడ్డ శరత్‌కుమార్, మాజీ కౌన్సిలర్‌లు చిటికిన నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, పలువురు కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.
కమిషనర్ బాపిరాజుతో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు, నాయకుల వాగ్వాదం కోర్టు స్టే ఉన్నందున తొలగించరాదంటూ అడ్డుకున్న వైనం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులు చర్చలు ఫలించడంతో సద్దుమణిగిన వివాదం

కమిషనర్ అత్యుత్సాహం

కమిషనర్ అత్యుత్సాహం