జగ్గయ్యపేట అర్బన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని, వీటి ఏర్పాటులో జగ్గయ్యపేట దిక్సూచిగా నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 508 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం స్థానిక కోదాడ రోడ్‌లోని బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ముందుగా సీసీ కెమెరాలను బటన్ నొక్కి ఆమె ప్రారంభించారు. అనంతరం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ జగ్గయ్య పేటలో 508 సీసీ కెమెరాల ఏర్పాటుకు కారణం అయిన ఎమ్మెల్యే తాతయ్య, సీపీ రాజశేఖరబాబు నేతృత్వంలో జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అనంతరం పోక్సో చట్టానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఆఫ్ పేష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళల రక్షణ కోసం నిర్ధేశించిన శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు.
అగ్రగామిగా జిల్లా..
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా కేసులు ఛేదించడంలోనూ, రికవరీలోను అగ్రగామిగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో 2,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీసీపీలు మహేశ్వరరాజు, గౌతమిశాలి, సరిత, ఉదయరాణి, తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణమూర్తినాయుడు, ఏడీసీపీలు రామకృష్ణ, ప్రసన్నకుమార్, సురక్ష కమిటీ కన్వీనర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత


