కొండాయపాలెం(పామర్రు): పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో కొండాయ పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదమద్దాలి శివారు కొండాయపాలెం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఢీ కొట్టిన లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పామర్రు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మరో లారీకి తాళ్లు కట్టి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. లారీడ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మలుపులో లారీ ఆగి ఉండటంతో వేగం వస్తున్న లారీ డ్రైవర్ చూడక ఢీకొట్టాడని తెలుస్తోంది. లారీ డ్రైవర్ తోట్లవల్లూరు మండలం కళాసుమాలపల్లికి చెందిన గుంజ శ్రీనివాసరావుగా గుర్తించారు. బాధితుడిని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీ ఢీ.. వృద్ధుడి మృతి
పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పీఎస్ సమీపంలో ప్రకాష్‌నగర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న టి.పైడిరాజు (65)ను లారీ ఢీ కొనగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానాయక్‌నగర్‌కు చెందిన తాలాడి పైడిరాజు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. చేపల మార్కెట్ వద్ద చేపలు కొనుగోలు చేసి వాటిని బాగు చేయించడానికి ప్రకాష్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ.. అతన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన పైడిరాజు తలపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు టి.శ్రీను ఫిర్యాదుపై పోలీసులు కేసు నమాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కారు ఢీకొని వ్యకి దుర్మరణం
చౌటుప్పల్ రూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన గొరిపర్తి నాగేశ్వరరావు(52) 30 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి వలస వచ్చి స్థానికంగా ఓ కెమికల్ పరిశ్రమలో క్యాంటిన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిజినెస్‌లో నష్టం రావడంతో ప్రస్తుతం అంకిరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా శనివారం హోటల్‌లో పనిచేయడానికి వెళ్లిన నాగేశ్వరరావు ఉదయం 11గంటలకు ఇంటికి వెళ్లడానికి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు ఘటనా స్థలిలోనే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహమైంది. భార్య, కొడుకు కూడా హోటల్‌లోనే పని చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు గొరిపర్తి కృష్ణ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ చెన్నబోయిన సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మఽథకుమార్ తెలిపారు.


