
తిరుపతమ్మ తిరునాళ్లలో ఉద్రిక్తత
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లలో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మ వారి పుట్టింటి పసుపు – కుంకుమ బండ్లు అమ్మ వారి ఆలయం వద్దకు చేరుకునే సరికి సోమవారం అర్ధరాత్రి దాటింది. ఈ క్రమంలో అమ్మవారి బండితో పాటు టీడీపీ, జనసేన, సీపీఐ, వైఎస్సార్ సీపీ బండ్లు, ట్రాక్టర్లకు కూడా ప్రభలు కట్టారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బండ్లు పోలీస్‌స్టేషన్ సెంటర్ చేరే సరికి టీడీపీ వారు డీజేల్లో పాటలు, డైలాగులతో కవ్వింపు చర్యలకు దిగారు. ఇది కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఎవరో విసిరిన రాళ్లతో ఏపీఎస్‌పీ ఎస్‌ఐ లక్ష్మీనారాయణతో పాటు విజయవాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్.మణికంఠ, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఎ.యేసోబు రాజు, పెనుగంచిప్రోలు కానిస్టేబుల్ రమేష్‌కు గాయాలయ్యాయి. వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు.
వైఎస్సార్ సీపీ బండి గంటల తరబడి నిలిపివేత
వైఎస్సార్ సీపీ బండిని అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో సుమారు రెండు గంటలకు పైగా టీడీపీ బండ్లు వచ్చే వరకు వైఎస్సార్ సీపీ బండి ముందుకు వెళ్లకుండా అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు దగ్గరుడి నిలిపి వేశారని స్థానికులు పేర్కొంటున్నారు. టీడీపీ బండ్లు వచ్చిన తరువాత వారు రెచ్చగొట్టే డైలాగ్‌లు, పాటలు పెట్టడంతోపాటు ఎవరో వాటర్ బాటిల్ విసరటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో ఇరు వర్గాలను లాఠీలకు పనిచెప్పి చెదరగొట్టారు. టీడీపీ బండి వచ్చే వరకు వైఎస్సార్ సీపీ బండిని నిలపకుండా వెళ్లనిస్తే ఘర్షణ జరిగేది కాదని, పోలీసుల తీరు వల్లే ఇలా జరిగిందని విమర్శిస్తున్నారు.
రెండు వర్గాలను చెదరగొట్టాం
నందిగామ ఏసీపీ తిలక్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు ముందు అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులతో సమీక్షా సమావేశాలు నిర్వహించామని, బండ్ల వద్ద డీజేలకు ఎలాంటి పార్టీ పాటలు, రెచ్చగొట్టే డైలాగ్స్ ఉండకూడదని చెప్పామన్నారు. నాయ కులు కూడా అలాంటివి ఉండవని చెప్పారని పేర్కొన్నారు. అమ్మవారి బండి వెనుక టీడీపీ, జనసేన బండ్లు, తరువాత వైఎస్సార్ సీపీ బండ్లు పంపుతున్నామని, ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో ఒకరికొకరు ఎదురు పడిన సందర్భంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, వెంటనే అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టామన్నారు. రాళ్లుతో దాడి చేసిన వారిని గుర్తించామన్నారు.
పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో రెండు వర్గాల ఘర్షణ నలుగురు పోలీసులకు గాయాలు