
జి.కొండూరు: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోడూరు శివారు గ్రామం కండ్రిక వద్ద చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారదాసు రవీంద్రబాబు (25) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మైలవరంలో పనిచేసి గురువారం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో చిన్న నందిగామ గ్రామానికి చెందిన ట్రాక్టరు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్రబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు దుర్గారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.