ప్రభుత్వ ముద్రణాలయంలో స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): క్రీడలతో మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతా యని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.వెంకటరామిరెడ్డి అన్నారు. ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయంలో శనివారం ప్రత్యేక రక్షణ దళం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రత్యేక రక్షణ దళం ఆధ్వర్యాన స్పోర్ట్‌మీట్ ప్రారం భోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ డయాబెటిక్ వైద్య నిపుణుడు కె.వేణుగోపాలరెడ్డి, ప్రభుత్వ ముద్రణాలయం డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్‌కుమార్, కమాండెంట్ ఎం.శంకరరావు తదితరులతో కలిసి పావురాలు, గ్యాస్ బెలూన్‌లను ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలన్నారు. పోటీల్లో ఉద్యోగులు పాల్గొని తమ లోని ప్రతిభను చాటాలని సూచించారు. డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. క్రీడల ద్వారానే చక్కని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అని తద్వారా డయాబెటిస్ ఇంకా ఇలాంటి తదితర రోగాల బారిన పడకుండా ఉండొచ్చన్నారు. ప్రభుత్వ ముద్రణాలయం డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్.మోహన్‌కుమార్ మాట్లాడుతూ.. ముద్రణాలయంలో ఇంత చక్కటి క్రీడా పోటీలను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరూ సెల్‌ఫోన్‌లకు అంకితం కాకుండా క్రీడల్లో రాణించాలని సూచించారు. విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకరరావు మాట్లాడుతూ.. ఇక్కడ రెండు రోజుల పాటు ఆరు టీమ్‌లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముద్రణాలయం ఇన్‌చార్జి జూనియర్ మేనేజర్ నాగవరపు శరత్, అసిస్టెంట్ కమాండెంట్ పి.హేమసుందరరావు, ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ విజయ్ కుమార్, బి.ఫణి కుమార్, బి.సన్యాసయ్య, రిటైర్డ్ సిబ్బంది పాల్గొన్నారు.


