
అభివృద్ధి చేయాల్సిన అంశాలను అధికారులకు వివరిస్తున్న కలెక్టర్ రాజాబాబు
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్, కలెక్టర్ బంగ్లాతో పాటు మంగినపూడిబీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులకు సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆయన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బంగ్లా, కలెక్టరేట్, మంగినపూడి బీచ్ చిత్రాలను బోర్డుపై గీసి ఎలా అభివృద్ధి పరచాలో వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ మూడు ప్రాంతాలను తక్కువ ఖర్చుతో ప్రకృతి రమణీయంగా, సుందరంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్రణాళికను తయారుచేసి ఇవ్వాలన్నారు. కలెక్టర్ బంగ్లా 1826 నాటిదని, ఈ భవనం పురాతన కట్టడానికి ఎటువంటి తొలగింపులు లేకుండా యథాతధంగా ఉంచుతూ పటిష్టపరచాల్సిన అవసరం ఉందన్నారు. భవనం పైకప్పు సరిచేయాల్సి ఉందన్నారు. బంగ్లాలో భవనం 10 అడుగుల చుట్టూ ప్రకృతి రమణీయంగా, సుందర ఆకృతులతో తీర్చిదిద్దాలన్నారు. బంగ్లా లోపలికి ప్రవేశించే రెండు మార్గాలను సీసీ రహదారులుగా మార్చాలన్నారు. భవనం ముందు వైపు పూలతోటను అభివృద్ధి పరచాలని, ప్రధాన భవనం సుందరంగా కనపడేలా ఫోకస్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్ ప్రహరీ వెంబడి మురుగునీటి వ్యవస్థను సరిచేయాలన్నారు.
బీచ్ అభివృద్ధికి..
మంగినపూడిబీచ్‌లో పిచ్చిమొక్కలు తరలించి ఫోకస్ విద్యుత్‌దీపాలు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాల వద్ద హైమాస్ట్ విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులు, భద్రత సిబ్బంది ఉండేందుకు గదులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రణాళికా వాస్తు కళా విద్యాలయం సహాయ ఆచా ర్యులు డి. శ్రీనివాస్, సీహెచ్ కార్తిక్, జి. షణ్ముకప్రియ, కేవీ రావు, పర్యాటక మేనేజర్ రాంలక్ష్మణరావు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఈఈలు రమణారావు, శ్రీనివాస్, ఉద్యానశాఖ అధికారి మానస పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్ రూపొందించాలని
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశం