ఏఎస్‌డీడీ జాబితా ఓటర్లకు ఊరట చిరునామా మారిన వారికి మార్గం సుగమం ఫారం –8 అవసరం లేకుండానే ప్రక్రియ ఈ నెల 21 వరకు దరఖాస్తు గడువు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుంచి పేర్లు గల్లంతైన, చిరునామా మారిన ఓటర్లకు ఎన్నికల సంఘం (ఈసీ) మరో అవకాశాన్ని కల్పించింది. ఇదివరకే ప్రచురించిన సర్ ముసాయిదా జాబితాలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) కారణాలతో పేర్లు తొలగింపునకు గురైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాలో చేరుస్తామని ఈసీ ప్రకటించింది. ఆగస్టు 17వ తేదీన విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 48,139 మంది ఏఎస్‌డీడీ కేటగిరీల్లో ఉండగా.. వారిలో అత్యధికంగా 23,766 మంది శాశ్వత చిరునామా మారిన వారే ఉన్నారు. వీరు తిరిగి ఓటరు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రక్రియను సులభతరం చేశారు. మరణించిన వారు 11,334, ఆబ్సెంట్ 2,188 మంది, ఇతరులు 388 మంది, రెండు చోట్ల ఓటు కలిగిన వారు 10,463 మంది ఉన్నారు.
ఫారం –8 అవసరం లేదు..
చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా ఫారం –8 సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఫారం –6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చిరునామాకు సంబంధించిన ఆధారం సమర్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. కొత్త చిరునామా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో చిరునామా మారినవారు తిరిగి ఓటర్ల జాబితాలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. ఇలాంటి వారు ఈనెల 21వ తేదీలోపు సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఓటుహక్కును కోల్పోయిన పౌరులు బూత్ లెవల్ అధికారి, ఎ న్నికల నమోదు అధికారి, సహాయక అధికారిని సంప్రదించి, అవసరమైన పత్రాలను అందజేసి ఓటరు జాబితాలో పేరును పునరుద్ధరించుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదాలో ఓటరుగా పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశాన్ని అర్హులు సద్వినియో గం చేసుకోవాలి. పేర్లు గల్లంతైన వారు, చిరునామా మారిన ఓటర్లు బీఎల్‌వోలను సంప్రదించాలి. ఓటరు జాబితా సమగ్ర సవరణలో మ్యాపింగ్ ప్రక్రియతో పాటు తదుపరి పరిశీలనలో వివిధ కారణాల వలన నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లకు ఇది మంచి అవకాశం.
– కె. హరిత, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
ఏఎస్‌డీడీ జాబితా వివరాలు..


