వాంకిడి: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రేగుంట కేశవ్‌రావు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి కొమ్ము శేఖర్, కుమురంభీం జిల్లా ఇన్‌చార్జి జంగాపల్లి రాజేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం డిగ్రీ కళాశాల ను సందర్శించి ప్రిన్సిపాల్ కనకయ్య, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలను దాదాపు రూ.12 కోట్లతో నిర్మించి ఆరేళ్లు కావస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారాని కి నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికీ తాగు నీరు, రోడ్డు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దాదాపు 450 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి మౌలిక వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. బాయ్స్ హాస్టల్ కోసం భవనం నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని, గర్ల్స్ హాస్టల్ కోసం భవనం నిర్మించలేదని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.


