నిబంధనలు స్క్రాప్‌.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు స్క్రాప్‌..

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

రహదారి పక్కన, పాఠశాలల ఎదుట దుకాణాలు ఏర్పాటు రోడ్డుపైనే గ్యాస్‌ కట్టర్‌తో పనులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు నిబంధనలకు విరుద్ధంగా స్క్రాప్‌ తరలింపు

ఈ ఫొటోలో కనిపిస్తున్న స్క్రాప్‌ దుకా ణం కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన జనావాసాల మధ్య ఉంది. ఈ దుకాణం ముందు ఉన్న రోడ్డుపైనే పాత వాహనాలు, ఇనుప గాడర్లను వేసి గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేస్తుండడంతో ఈ రోడ్డుగుండా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు దుకాణం యజమానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని గాంధీనగర్‌ కాలనీవాసులు వాపోతున్నారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన స్క్రాప్‌ దుకాణాలతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ గల్లీల్లో, పాఠశాలల ఎదుట, ప్రధాన రోడ్ల పక్కన ఎక్కడ స్థలం కనపడితే అక్కడ ఓ కంప్యూటర్‌ కాంటా పెట్టి స్క్రాప్‌ దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల నియంత్రణ లేకపోవడంతో ఇటువంటి దుకాణాలు పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్క్రాప్‌ దుకాణాల యజమానులు రోడ్లను ఆక్రమించుకుని ఏదో స్థలాన్ని అద్దెకు తీసుకుని తొలుత చిన్నగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు. తర్వాత తమ దుకాణం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆక్రమించుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. తుక్కుతో నిండిన సరుకుతో ఆ ప్రాంతం నిండిపోవడమే కాకుండా భారీ వాహనాల్లో తమ సరుకు తీసుకొచ్చి రోడ్డుపై డంప్‌ చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారి, గాంధీనగర్‌, వినయ్‌ గార్డెన్‌, ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల, ఎల్లగౌడ్‌ తోట సమీపంలో జనావాసాల మధ్యలో, ఇందిరా మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా స్క్రాప్‌ దుకాణాలు ఉన్నాయి. దీంతో చిన్నచిన్న వీధులు కలిగిన ప్రాంతాల ప్రజలతో పాటు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.

గ్యాస్‌ కట్టర్‌తో భయాందోళన..

స్క్రాప్‌ దుకాణాలు నిర్వహిస్తున్న సమీపంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భారీ స్క్రాప్‌ వాహనాలను, పాత గ్యాస్‌ సిలిండర్లు, ఐరన్‌ వస్తువులు, పాత వాహనాలు, పెద్దపెద్ద గాడర్లను కట్‌ చేయడానికి గ్యాస్‌ కట్టర్‌ను వాడుతారు. ప్రమాదకరమైన గ్యాస్‌ కట్టర్‌ వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రోడ్డుపక్కనే గ్యాస్‌ కట్టింగ్‌ చేయడంతో నిప్పు రవ్వలు ఎగిరిపడుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు, ఇళ్ల మధ్య నడుస్తున్న స్క్రాప్‌ దుకాణాలను తొలగించి, ఊరి బయటకు తరలించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

లైసెన్స్‌ నామ మాత్రమే..

జిల్లాలోని స్క్రాప్‌ దుకాణాల యజమానులు నామమాత్రంగా లైసెన్సులు తీసుకుని హైదరాబాద్‌, మహారాష్ట్రలకు చెందిన బ్రోకర్ల ద్వారా అధికారుల కళ్లుగప్పి స్క్రాప్‌ను తరలిస్తున్నారు. ఎక్కడైనా వీధికి ఒకటో రెండో స్క్రాప్‌ దుకాణాలు ఉంటాయి. కానీ కాగజ్‌నగర్‌లో పదుల సంఖ్యలో దుకాణాలు వెలిశాయి. నిబంధనల ప్రకారం స్క్రాప్‌ దుకాణానికి మున్సిపల్‌ ట్రేడ్‌ లైసెన్సు, పొల్యూషన్‌ ఎన్‌ఓసీ, ఫైర్‌ ఎన్‌ఓసీ, పోలీస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలి. కానీ కాగజ్‌నగర్‌లో చాలా దుకాణాలకు ఇవేవీలేవు. ఎవరో ఒకరిపేరు మీద లైసెన్సు తెచ్చుకుని, దానిని చూపించి పట్టణమంతా వ్యాపారం చేస్తున్నారు. ఒక లైసెన్సుతో 5 –6 బ్రాంచ్‌లు నడుపుతున్న వైనం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. లైసెన్సు లేని దుకాణాలను సీజ్‌ చేసి, బ్రోకర్లపై కేసులు పెట్టి, స్క్రాప్‌ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో విచారణ జరపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement