ఆసిఫాబాద్: జిల్లాలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం 5నుంచి రాత్రి 11గంటల వరకు విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉంటోంది. ఈ క్రమంలో కరెంట్ వినియోగం గణనీయంగా పెరిగింది. గత మూడు నెలల్లో రోజుకు సగటున 46 నుంచి 57 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, ఈ నెల 12న ఒక్కసారిగా 103.50 మెగావాట్లకు చేరింది. విద్యుత్ వినియోగం 1.560 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. మీటర్లు గిరగిరా తిరగడంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులుండగా రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశాశముంది. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలలో 132/33 కేవీ సబ్స్టేషన్లు ఉండగా, మరో 34 వరకు 33/11 కేవీ సబ్స్టేషన్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,82,420 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,44,512 గృహ, 15,681 వాణిజ్య, 645 పరిశ్రమలు, మరో 16,156 వరకు వ్యవసాయ కనెక్షన్లున్నాయి. గత సెప్టెంబర్‌లో జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.1.13 కోట్ల ఆదాయం సమకూరింది.
పెరిగిన వినియోగం ఇలా..
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుండగా ఉపశమనం కోసం జనాలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వి నియోగిస్తున్నారు. ప్రతీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాల వాడకమూ పెరిగింది. ఈ క్రమంలో జిల్లాలో అనధికార విద్యుత్‌కోతలు విధిస్తున్నారు. అక్టోబర్‌లో సాధారణం కంటే రెట్టింపు విద్యుత్ డిమాండ్ పె రిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్లు, కూల ర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రిడ్‌లో ఒత్తి డి పెరిగింది. జిల్లాలో యాసంగి సాగూ గణనీయంగా పెరిగింది. కుమురంభీమ్, వట్టివాగు ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు అవసరమున్న సాగునీరందక రైతులు రాత్రివేళ బోర్లు అధికంగా వినియోగిస్తున్నా రు. వేసవిలో సాధారణం కంటే అధికంగా విద్యుత్ పరికరాలు వినియోగించడంతో మీటర్లు స్పీడ్‌గా తి రిగి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా ప్రతీ 12, 13 తేదీల్లో విద్యుత్ డిమాండ్‌ను పరిశీలిస్తే జూలైలో అత్యధికంగా 57.05మెగావాట్లు, ఆగస్టులో 52.62 మెగావాట్లు, సెప్టెంబర్‌లో 46.26 మెగావాట్లు ఉండగా, ఈనెల 12న ఒక్కసారిగా 103.50 మెగావాట్లు వినియోగించారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది.
నియంత్రణ తప్పనిసరి
జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ అవసరాలను నియంత్రించాల్సిన అవసరముందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఇంట్లో ఎల్ఈడీ బల్బులు వాడాలని, తక్కువ వాట్స్ విద్యుత్ సాధనాలు ఉపయోగించాలని, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, వాటర్ హీటర్లు, టీవీలు ఆఫ్ చేయాలని, రాత్రివేళ వినియోగం తగ్గించాలని పేర్కొంటున్నారు. రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో వినియోగించాలని చెబుతున్నారు. వినియోగదారులు సోలార్ పంపుసెట్లు, సౌరశక్తి ఆధారిత పరికరాలు ఉపయోగించి విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచిస్తున్నారు.


