లింగాపూర్: ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పె డుతున్నారని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన ఆదివాసీలు గురువారం సిర్పూర్(యు) మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా కు దిగారు. కుమురంభీం, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ చౌక్ నుంచి ఫారెస్ట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రహదారులపై పడిన గుంతల్లో మట్టి పోయాలన్నా అభ్యంతరం చెబుతున్నారన్నారు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా బావులు, బోర్వెల్స్ ఏర్పాటు చేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


