అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార కార్యక్రమానికి శ్రీకారం పైలట్ ప్రాజెక్టుగా కుమురంభీం జిల్లాలో అమలు కలెక్టర్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం ఉప్మా, కిచిడీ టిఫిన్లకు ప్రాధాన్యం
కెరమెరి: చిన్నారుల ఎదుగుదలకు తొలిదశ నుంచే పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకం ‘తొలి ముద్ద’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజనం, ప్రతిరోజూ ఇచ్చే ఉడికించిన గుడ్డు, సాయంత్రం స్నాక్స్‌కు అదనంగా ఈ అల్పాహారం అందించనున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశా రు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కె.హరిత అధికారికంగా ప్రారంభించారు. పూర్తిస్థాయిలో స రుకులు జిల్లాకు చేరగానే అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. చిన్నారుల ఆకలి తీర్చడమే కాకుండా పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరిజన జనాభా అధికంగా ఉన్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో కార్యక్రమం అమలు తీరు, చిన్నారులకు కలిగే ప్రయోజనాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను రాష్ట్రస్థాయి యంత్రాంగం పరిశీలించనుంది. తద్వారా వచ్చే అనుభవాలు, ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మిగిలిన జిల్లాల్లో అమలు చేయనున్నారు.
45,708 మంది చిన్నారులు
జిల్లాలో1006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఆరేళ్లలోపు చిన్నారులు 45,708 మంది ఉన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం కలెక్టర్ కె.హరిత సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే క్షేత్రస్థాయిలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇంకా సరుకులు చేరుకోలేదు. తొలివిడతలో ప్రస్తుతం 500 కేంద్రాల్లో ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన సరుకులు జిల్లాకు చేరిన వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభోత్సవంలో స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన పెరగడంతోపాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
తల్లిదండ్రులకు అవగాహన
పిల్లల పోషణ విషయంలో అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా కుటుంబాల భాగస్వామ్యం కూడా పెంచడం కీలకం. చిన్నారులకు ఇంటి వద్ద ఎలాంటి ఆహారం ఇవ్వాలి.. ఏయే పోషక పదార్థా లను ఆహారంలో చేర్చాలి.. పరిశుభ్రతను ఎలా పా టించాలి.. వంటి అంశాలపై తల్లిదండ్రులకు అవగా హన కల్పించనున్నారు. స్థానికంగా సులభంగా ల భించే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల ను చిన్నారుల ఆహారంలో వినియోగించే విధానాని కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆహార నా ణ్యత, పరి శుభ్రత, వయసుకు తగిన ఆహారం వంటి పలు అంశాలను పోషకులకు వివరించనున్నా రు.
500 కేంద్రాల్లో ప్రారంభించాం
తొలిముద్ద అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. జిల్లాలోని 1006 అంగన్‌వాడీ కేంద్రాలకు తొలివిడతలో ప్రస్తుతం 500 కేంద్రాల్లో ప్రారంభించాం. మిగిలిన కేంద్రాల్లో మరో నాలుగు రోజుల్లో ప్రారంభిస్తాం. అంగన్‌వాడీ టీచర్లు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. – స్వరూపారాణి, జిల్లా సంక్షేమ అధికారి


