ఆసిఫాబాద్: ఎస్‌ఐఆర్ కుట్రలు బట్టబయలు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పారదర్శకత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదని పేర్కొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ముందుగా అంబేడ్కర్ చౌక్‌లోని విగ్రహానికి వినతిపత్రం అందించారు. అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ చేరుకుని ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, డేటాబేస్ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ వంటి కీలక అంశాల్లో ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్లడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ బీజేపీ రాజకీయంగా లాభం చేకూరే విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దుర్గం భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, ఏఎంసీ చైర్‌పర్సన్లు ఇరుకుల్ల మంగ, కుడిమెత విశ్వనాథ్, సుద్దాల దేవయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, డీఎంసీ వైస్ చైర్మన్ మాంతయ్య, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ సుద్దాల శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ అర్షద్ హుస్సేన్, నాయకులు రాపర్తి మురళి, ఇమ్రాన్, తారిక్, కౌన్సిలర్ కార్తీక్, గజ్జల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


