ఇది వెల్గీ పంచాయతీలోని మన్నెగూడ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్. ఇక్కడ ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా సెలవులో ఉన్నారు. అప్పుడప్పుడు ఒక టీచర్ గ్రామానికి వెళ్లి పిల్లల ఎఫ్‌ఆర్‌ఎస్(హాజరు) తీసుకుని వెళ్తునట్లు గ్రామస్తులు తెలిపారు. దీనిపై కాంప్లెక్స్ హెచ్‌ఎం ప్రభోద్‌ను ఫోన్‌లో వివరణ కోరగా ఉపాధ్యాయుడిని పంపిస్తున్నామని, వర్షాలు ఉన్నప్పుడు టీచర్ వెళ్లలేని పరిస్థితి ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ గ్రామానికి సరైన రోడ్డు ఉంది. వాహనాలు కూడా వెళ్తుండటం గమనార్హం. అలాగే జంబుల్‌ధరి గ్రామంలోని ఎంపీపీఎస్ సైతం సాయంత్రం 3 గంటలకే మూసివేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం టీచర్ వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. హాఫ్ డే లీవ్ పెట్టినా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.
వాంకిడి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పిల్లల భవితవ్యంపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. వాంకిడి మండలంలోని గిరిజన గ్రామాల్లో గల పాఠశాలను బుధవారం ‘సాక్షి’ సందర్శించింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మూడు పాఠశాలలు, మరో రెండు ఎంపీపీఎస్‌లు వివిధ సమయాల్లో మూసి ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఏదైనా ఒక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు సెలవు తీసుకుంటే ఆ స్థానంలో ఇతర పాఠశాలలో పనిచేసే టీచర్‌ను డిప్యూటేషన్‌పై పంపించాలి. ఈ విధానం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ లోపంతోనే తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది లింబుగూడలోని టీడబ్ల్యూపీఎస్. మధ్యాహ్నం 1:46 గంటలకు బడికి తాళం వేసి కనిపించింది. పాటగూడ పంచాయతీ కేంద్రంలోని టీడబ్ల్యూపీఎస్‌కు కూడా తాళం వేసి ఉంది. స్థానిక పిల్లలను అడిగితే సెలవు అని చెబుతున్నారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం నారాయణ మూర్తిని వివరణ కోరగా లింబుగూడ పాఠశాలకు టీచర్ హాజరైనట్లు తెలిపారు. కానీ ‘సాక్షి’ సందర్శించిన సమయంలో అక్కడ టీచర్, పిల్లలు ఎవరూ కనిపించలేదు. బడికి తాళం వేసి ఉంది.


