● మహిళలే లక్ష్యంగా దోపిడీలు ● రోడ్లపై అప్రమత్తతే శ్రీరామ రక్ష | - | Sakshi
Sakshi News home page

● మహిళలే లక్ష్యంగా దోపిడీలు ● రోడ్లపై అప్రమత్తతే శ్రీరామ రక్ష

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

● మహిళలే లక్ష్యంగా దోపిడీలు ● రోడ్లపై అప్రమత్తతే శ్రీరామ రక్ష ● పెరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసులు ● గతేడాది మే 19న ఆర్టీసీ బస్సులో చింతలమానెపల్లికి చెందిన రమ్య కాగజ్‌నగర్‌ నుంచి వెళ్తుండగా సిర్పూర్‌(టి) నుంచి లోనవెల్లి మధ్య హ్యాండ్‌ బ్యాగ్‌ జిప్‌ తీసి మూడున్నర తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆర్టీసీ సిబ్బంది కౌటాల పోలీస్‌ స్టేషన్‌ వద్ద బస్సు నిలిపి పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ● గతేడాది ఏప్రిల్‌ 8న కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడకు చెందిన బెజ్జూర్‌ మాజీ ఎంపీపీ డోకే రోజారమణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా, ఇద్దరు దొంగలు పట్టపగలే ముఖాలకు మాస్కు లు వేసుకుని వచ్చి ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు గొలుసు లాక్కెళ్లారు. ● గతేడాది మే 26న ఆసిఫాబాద్‌ మండలం మానిక్‌గూడలో అంగన్‌వాడీ కార్యకర్త పద్మ విధులు ముగించుకుని ఆసిఫాబాద్‌ వెళ్లేందుకు రహదారిపై బస్సు కోసం వేచి చూస్తున్నారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘దొంగలు వస్తున్నారు, బంగారం ఉంటే దాచుకోండి’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో బైక్‌పై ఇద్దరు వచ్చి.. ‘మేం పోలీసులం.. పుస్తెలతాడు, చెవి కమ్మలు తీసి మాకివ్వండి’ అని చెప్పడంతో నమ్మి వారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత బాధితురాలిని ఏమార్చి రాళ్లు కాగితంలో కట్టి ఇచ్చి వెళ్లిపోయారు. ● ఆరు నెలల క్రితం కాగజ్‌నగర్‌ పట్టణంలోని రైల్వే కాలనీలో ఓ మహిళ సాయంత్రం సమయంలో ఇంటి ఎదుట కూర్చొని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని రైలు ఎక్కి పరారయ్యాడు. ● ఐదు నెలల క్రితం రెబ్బెన మండలం గోలెటిలో బంగారానికి పూత వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ వద్ద నుంచి బంగారం తీసుకుని నకిలీ బంగారం చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అలాగే అదే వారంలో కాగజ్‌నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారానికి మెరుగు వేస్తామని చెప్పి బంగారంతో ఉడాయించారు.

కౌటాల: దొంగలు రూటు మారుస్తున్నారు. గతంలో గృహాలు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను అడ్డాలుగా మార్చుకుని చోరీలకు పాల్పడేవారు. ప్రస్తుతం బంగారమే వారి ప్రధాన లక్ష్యంగా మారింది. గోల్డ్‌ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు లాక్కెళ్తున్నారు. ఏటా జిల్లాలో వందకు పైగా దొంగతనాల కేసులు నమోదవుతుండగా, రూ.కోట్ల విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. 2024లో 50 దొంగతనాలు జరగ్గా, 2025లో వాటి సంఖ్య 151కు పెరిగినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఒంటరి మహిళలే లక్ష్యం..

గోల్డ్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో నేరగాళ్ల దృష్టి బంగారంపై పడింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఒంటరిగా నడుస్తున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ తక్కువగా ఉన్న రహదారులపై ఆభరణాలు అపహరిస్తున్నారు. ముఖాలకు మాస్కులు, హెల్మెట్లు పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారు. బైక్‌లపై వేగంగా వచ్చి మెడలోని గొలుసు లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి బయటపడుతున్నారు. దుండగులు బలంగా లాగుతుండటంతో కొన్ని సందర్భాల్లో బాధితులు తీవ్రంగా గాయపడుతున్నారు.

జిల్లాలో కొన్ని ఘటనలు

శనివారమే అక్కడ చోరీలు

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో వారసంత జరిగే శనివారమే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఈ నెల 11న కౌటాల మండలం మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన ఎల్ములే అంజనాబాయి బస్టాండ్‌లో కౌటాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు చైన్‌ అపహరించారు. బాధితురాలు సిర్పూర్‌(టి) పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్‌ తెలిపారు. కాగా, అదేరోజు నాలుగు ఫోన్లు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వారాంతపు సంతలో పార్కింగ్‌ చేసిన రెండు బైక్‌లు చోరీకి గురయ్యాయి. పోలీసులు వారాంతపు సంత రోజు ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాలతో పాటు గ్రామీణ మండలాల్లోనూ చోరీలు పెరిగాయి. సగం మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. ఫలితంగా మహారాష్ట్ర నుంచి కౌటాల, బెజ్జూర్‌, వాంకిడి, సిర్పూర్‌(టి), చింతలమానెపల్లి, కాగజ్‌నగర్‌, రెబ్బెన మండలాలకు నిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీంతో చోరీలకు పాల్పడిన వారు రైల్వే మార్గాలను వినియోగించుకుంటూ పొరుగు రాష్ట్రం వైపునకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి, సొమ్ము రికవరీలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చిక్కకుండా సరిహద్దు దాటుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement